పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ జిల్లా కోర్టు దోషిగా ప్రకటించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పు ప్రకటించిన కొద్దిసేపటికే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్ల జైలు శిక్షపై అప్పీలు చేసుకోవడానికి వీలుగా 30 రోజుల పాటు ఈ ఉత్తర్వులపై స్టే విధించింది.. అప్పీలు దాఖలు చేసేంతవరకు ఈ శిక్షను ఇన్ని రోజులు నిలిపివేస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.
కోర్టులో రాహుల్ తరఫు వాదించిన లాయర్ జిగ్నేష్.. తన క్లయింట్ ను సమర్థించుకుంటూ ఆయన ఉద్దేశపూర్వకంగా ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు. సాధారణంగా ప్రజలు మాట్లాడే మాటలనే ఆయన ప్రస్తావించారన్నారు. అసలు ఈ కేసులోప్రొసీడింగ్స్ అన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని జిగ్నేష్ పేర్కొన్నారు.
10 వేలరూపాయల బెయిల్ బాండుపై కోర్టు రాహుల్ కి ఊరటనిచ్చింది. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటక లోని కోలార్ లో జరిగిన ర్యాలీలో రాహుల్.. సాధారణంగా దొంగలందరి ఇంటిపేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశించి ఆయన ఈ మాటలన్నారు.
గురువారం సూరత్ కోర్టు బయట పెద్ద సంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు తమ నేతకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. గుజరాత్ కాంగ్రెస్ నేతలంతా రాహుల్ కి సంఘీభావంగా అక్కడికి చేరుకున్నారు. కోర్టు తాజా నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.