శ్రీనగర్ లో అన్న చెల్లెళ్ళిద్దరూ సరదాగా మంచు ముక్కలతో ఆడుకోవడంపై కేంద్రం వెరైటీగా స్పందించింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సోమవారం కశ్మీర్ లో విపరీతంగా మంచు కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా చిన్న పిల్లల్లా ఆడుకున్నారంటే ఇది ప్రధాని మోడీ చలవ గాక మరేమిటని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. 2014 తరువాత జమ్మూ కశ్మీర్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ముఖ్యంగా 370 అధికరణం, 35 ఏ ని రద్దు చేసిన తరువాత ఇప్పుడు అక్కడ ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.
‘శ్రీనగర్ లో వాళ్లిద్దరూ స్నో బాల్స్ తో ఎలా ఆడుకున్నారో మీరు చూశారు.. కానీ ఈ పరిస్థితికి కారణమైన ప్రధాని మోడీకి వారు కృతజ్ఞత చెప్పడం మరిచిపోయారు.. ఇప్పుడు అక్కడ శాంతి నెలకొనడమే గాక. టూరిజం కూడా పెరిగింది’ అని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజల అభ్యున్నతి కోసం మోడీ ప్రభుత్వం చేబట్టిన చర్యల ఫలితమే ఇదన్నారు.
రాహుల్ గాంధీ తల పెట్టిన భారత్ జోడో యాత్రలో ఈ దేశ సమైక్యతకోసం కృషి చేసినవారి బదులు ఈ దేశాన్ని విడగొట్టడానికి యత్నించినవారు కనిపించారని అనురాగ్ ఠాకూర్ సెటైర్ వేశారు. ఇలాంటి వ్యక్తులతో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు.
ఇక బీజేపీ నేత సుధాన్షు త్రివేదీ.. మరో రకంగా స్పందిస్తూ తమ పార్టీ నాయకులు చేసిన త్యాగాల కారణంగానే రాహుల్ గాంధీ శ్రీనగర్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేయగలిగారన్నారు. భారత్ జోడో యాత్ర సంఘ వ్యతిరేక శక్తులనన్నీ ఒకచోట కలిపిందని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు.