రాహుల్ గాంధీ తన పెండ్లిపై ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో వివాహం గురించి రాహుల్ గాంధీని ఒకరు ప్రశ్నించారు. దానికి ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. తనకు తన నానమ్మ ఇందిరా గాంధీ, అమ్మ సోనియా గాంధీల లక్షణాలు ఉన్న అమ్మాయిలంటే ఇష్టమని సమాధానమిచ్చారు.
తనకు నానమ్మ ఇందిరా గాంధీ అంటే ప్రాణమని ఆయన అన్నారు. ఆమె తనకు రెండో తల్లిలాంటిదని ఆయన వెల్లడించారు. అదే సమయంలో ఓ రిపోర్టర్ మధ్యలో ప్రశ్న అడిగారు. మీ నానమ్మ లాంటి లక్షణాలున్న అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? అంటూ ఆయన ప్రశ్నించాడు.
దీంతో చాలా ఆసక్తికరమైన ప్రశ్న అడిగారంటూ రిపోర్టర్ ను కొనియాడాడు. తాను నానమ్మ, అమ్మ ఇద్దరి లక్షణాలున్న మహిళలను ఇష్టపడతానని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా యూట్యూబ్ ఛానల్ మాషబుల్ ఇండియా బాంబే జర్రీపై స్పెషల్ ఎపిసోడ్ నిర్మించింది. ఇందులో అభిమానులు, సాధారణ ప్రజలు రాహుల్ని ప్రశ్నలు అడిగారు. దానికి ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. మిమ్మల్ని కొందరు పప్పు అని పిలుస్తున్నారు కదా మీకు బాధ అనిపించడం లేదా? అని అడిగారు. దానికి ఆయన అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. ఇదంతా రాజకీయంలో ఓ భాగంగానే తనను అంటున్నారని చెప్పారు.
తాను తన తండ్రి రాజీవ్‌గాంధీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. తన తల్లి తనకు అన్ని విషయాల్లో మార్గదర్శిగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. కార్లంటే ఇష్టమా అని మరొకరు ప్రశ్నించారు. దానికి బదులిస్తూ వాస్తవానికి తనకు ఒక్క కారు కూడా లేదని వెల్లడించారు. ఎటైనా వెళ్లినప్పుడు అమ్మ కారును వాడుతానని చెప్పారు. తకు డ్రైవింగ్ అంటే ఇష్టమేనన్నారు. కానీ అంతకన్నా నడవడం అంటే చాలా ఇష్టమన్నారు.