– సర్కార్ కంట్రోల్ లో ఓయూ!
– హైకోర్టు తీర్పు సైతం బేఖాతరు
– ఘనంగా టీఆర్‌ఎస్ నేత బర్త్ డే వేడుకలు
– ఓయూలో నాయకుల బర్త్ డేలు వద్దన్న హైకోర్టు
– ఇవేం రూల్స్ అంటూ ప్రశ్నిస్తున్న విద్యార్థులు
– రాహుల్ టూర్ పై కొనసాగుతున్న రచ్చ
రాహుల్ తెలంగాణ టూర్ పై రాష్ట్రం అంతటా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ లో కొత్త ఉత్తేజాన్ని నింపేందుకు అగ్రనేతను రాష్ట్రానికి తీసుకొస్తోంది టీపీసీసీ. అన్నదాతల కోసం రైతు సంఘర్షణ పేరుతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు హస్తం నేతలు. దానికోసం ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. ఈ క్రమంలోనే రాహుల్ ను ఓయూ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించాలని అనేక ప్రయత్నాలు చేశారు. ఆఖరికి న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. అయితే.. హైకోర్టు అంతా వీసీకే వదిలేసింది.
రాహుల్ ని ఓయూకి తీసుకురావాలని వీసీకి వినతి పత్రాలు అందించారు కాంగ్రెస్ నేతలు, విద్యార్థి నాయకులు. కానీ.. ఆయన మనసు కరగడంలేదు. రాహుల్ ని వర్సిటీకి రానిచ్చే విషయంలో ససేమీరా అంటున్నారు. అయితే.. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందనేది కాంగ్రెస్ నేతల వాదన. ప్రభుత్వం కావాలనే రాహుల్ ను రానివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్ నేతలు కూడా మాటల యుద్ధానికి దిగారు. రాహుల్ ఎందుకోసం వస్తున్నారు.. ఏం చెప్పడానికి వస్తున్నారు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలవుతున్న పథకాలు ఉన్నాయా? అంటూ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
అయితే.. హరీష్ ట్వీట్ కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. “పోలీసు పహారా లేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చింది హరీష్? నీ పర్యటన నేపథ్యంలో పొలాలకు వెళ్లి పోలీసులు రైతులను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పు. ప్రజాసేవలో కాంగ్రెస్ త్యాగాలు నీలాంటి అల్పులకు అర్థం కావు. రాహుల్ ను విమర్శించే స్థాయీ, అర్హత నీకు లేవు” అంటూ ఎటాక్ చేశారు. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. అయితే.. రాహుల్ ను ఓయూ టూర్ కు అనుమతి ఇవ్వకపోవడమే అనేక అనుమానాలకు తావిస్తోంది.
బీజేపీ, టీఆర్‌ఎస్ అనుబంధ విద్యార్థి సంఘాలు మినహా.. మిగిలిన మెజారిటీ విద్యార్థులు రాహుల్ రాకను స్వాగతిస్తున్నారు. తమకు ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ కేంద్రస్థాయిలో పరిష్కరించేందుకు రాహుల్ ఉపయోగపడతారని వారంతా భావిస్తున్నారు. కానీ.. ఆయనకు మాత్రం ఎంట్రీ లేదని వీసీ తెగేసి చెప్తున్నారు. ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. హైకోర్టు బుధవారం చెప్పిన దాని ప్రకారం.. “వర్సిటీలోకి బయటి వ్యక్తులను అనుమతించరాదు. ముఖ్యంగా రాజకీయ నేతలు, మాజీ విద్యార్థుల జన్మదిన వేడకలకు అనుమతిస్తే వివక్ష ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలకు అనుమతించవద్దు” అని తెలిపింది.
కానీ.. ఈ తీర్పు వచ్చి 24 గంటలు కూడా గడవకముందే ఓయూలో జరిగిందేంటంటే..? టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీను బర్త్ డే సందర్భంగా యూనివర్సిటీలో సంబరాలు చేసుకున్నారు టీఆర్‌ఎస్వీ విద్యార్థి నేతలు. ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో గులాబీ రంగులో పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి.. కేకులు కట్ చేసి.. వేడుకలు ఘనంగా జరిపారు. రాజకీయ నాయకులు, మాజీ విద్యార్థుల బర్త్ డేలను జరిపితే.. వివక్ష వస్తుందని హైకోర్టు చెప్పినా కూడా అవేవే ఓయూలో అమలు కాలేదు. టీఆర్‌ఎస్ నాయకుడి బర్త్ డే వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. దీన్నిబట్టి.. ఓయూ అధికారులు ప్రభుత్వం కంట్రోల్ లో ఎలా ఉన్నారో అర్థం అవుతోందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. రూల్స్ అంటే అందరికీ ఒకేలా ఉండేలి గానీ.. ఇలా ఒకరికి వంత పాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటు రాహుల్ ను ఓయూకి తీసుకొస్తామని విద్యార్థి సంఘాల నాయకులు తెగేసి చెబుతున్నారు.