కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. మే 6న సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు రాహుల్‌గాంధీ. అనంతరం హెలికాప్టర్ లో నేరుగా వరంగల్‌కు వెళ్లనున్నారు. మే 6, 7 తేదీల్లో రాహుల్ రాష్ట్ర పర్యటన దృష్ట్యా టీపీసీసీ ఆ దిశగా చర్యలను ముమ్మరం చేస్తోంది.
అయితే.. వరంగల్‌లో జరగనున్న రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రెండు వేదికలు ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ, ఇతర నేతలకు ఓ వేదిక.. ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత రైతు కుటుంబాలకు మరో వేదికను ఏర్పాటు చేశారు.
సభలో 7 గంటల వరకు ముఖ్య నేతలు ప్రసంగించనుండగా.. 7 గంటల నుంచి రాహుల్ ప్రసంగం ప్రారంభం కానుంది. సభ తరువాత రాహుల్ గాంధీ రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు చేరుకోని దుర్గం చెరువు పక్కన ఉన్న కోహినూర్ హోటల్లో బస చేయనున్నారు. 7వ తేది ఉదయం హోటల్ కోహినూర్‌లో పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో కలిసి అల్పాహారం చేయనున్న రాహుల్.. అక్కడి నుంచి మొదట సంజీవయ్య పార్కుకి వెళ్లనున్నారు. అక్కడ నివాళులు అర్పించి.. నేరుగా గాంధీ భవన్‌కు చేరుకోనున్నారు.
Advertisements
గాంధీభవన్‌లో దాదాపు 200 మంది ముఖ్య నాయకులతో రాహుల్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడే డిజిటల్ మెంబర్షిప్ ఎన్ రోలెర్స్తో ఫొటో సెషన్లో పాల్గొననున్నట్టు షెడ్యూల్ లో పేర్కొన్నారు. ఆ తరువాత లంచ్ మీటింగ్ తర్వాత.. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.