తెలంగాణలో రెండురోజుల పర్యటనలో భాగంగా రెండవరోజు విరామం లేకుండా పర్యటించారు. గాంధీభవన్ లో పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన రాహుల్.. సొంతపార్టీ నేతలకు ఆయన మరోసారి వార్నింగ్ ఇచ్చారు. సీనియర్లు అయినా సరే పార్టీ కోసం పనిచేయకుంటే టికెట్ రావడం కష్టం అని వ్యాఖ్యానించారు.
వ్యక్తిగతంగా ఒక్కొక్కరి గురించి సర్వే చేసి టికెట్లు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. వరంగల్ డిక్లరేషన్ గురించి ప్రతి వ్యక్తికి, ప్రతి రైతుకు, చిన్నపిల్లలకు సైతం తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. వరంగల్ లో చెప్పింది డిక్లరేషన్ మాత్రమే కాదని.. ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య ఒప్పందమని వివరించారు. రాష్ట్రంలో 8 ఏళ్లుగా అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. రాష్ట్ర సంపదనంతా కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని విరుచుకుపడ్డారు.
విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు రాహుల్. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో యువత కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నో ఆశయాలతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో కూర్చోని.. ఢిల్లీ చుట్టూ తిరిగితే టికెట్లు రావని కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్ ఇచ్చారు. తనకు హైదరాబాద్ బిర్యానీ, ఛాయ్ ఎంత బాగుంటుందో తెలుసని చెప్పిన రాహుల్.. టికెట్ దక్కాలంటే హైదరాబాద్ ను వదిలి గ్రామాల్లోకి వెళ్లాలని సూచించారు. వెనుక డోర్ నుంచి టికెట్ తెచ్చుకుంటామనుకునే వాళ్లు ఆశలు పెట్టుకోవాలని హెచ్చరించారు రాహుల్ గాంధీ.