ఢిల్లీ, ముంబైల లోని బీబీసీ కార్యాలయాలపై రెండో రోజైన బుధవారం కూడా ఐటీ ‘సర్వే’లు కొనసాగాయి. ఈ ఆకస్మిక సోదాలపై అమెరికాతో బాటు అమ్నెస్టీ ఇంటర్నేషనల్, న్యూయార్క్ లో జర్నలిస్టుల పరిరక్షణకు ఉద్దేశించిన ‘ఇండిపెండెంట్ నాన్-ప్రాఫిట్ కమిటీ’, ప్యారిస్ లోని ‘రిపోర్ట్స్ వితౌట్ బోర్డర్స్’ సంస్థ తీవ్రంగా స్పందించాయి. భావప్రకటనా స్వేచ్ఛను ఇది హరించడమేనని ఆమ్నెస్టీ ఇండియా మాజీ హెడ్ ఆకార్ పటేల్ ఆరోపించారు. జర్నలిస్టులను వేధించడం నిలిపివేయాలని న్యూయార్క్ లోని జర్నలిస్టుల పరిరక్షణ సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది.
బీబీసీ ఉద్యోగుల వేధింపులకు తక్షణమే స్వస్తి చెప్పాలని, వారిని ఇబ్బందిపెట్టడానికే ఐటీని వినియోగించుకుంటున్నారని విమర్శించింది. ఇండియాలో బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడుల విషయం తమకు తెలుసునని, అయితే దీనికి సంబంధించి సమాచారం మరింత తెలియవలసి ఉందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ ప్రెస్ అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఐటీ సర్వే పూర్తి అయిన తరువాత పూర్తి సమాచారాన్ని తెలియజేస్తారని, పన్ను ఎగవేతవంటివి జరిగినప్పుడు ఇలాంటి సర్వేలు సహజమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఇక ఢిల్లీ, ముంబైల లోని బీబీసీ కార్యాలయాల్లో చాలామంది ఉద్యోగులు ఇళ్లకు వెళ్లిపోగా, కొంతమందిని ఇక్కడే ఉండవలసిందిగా అధికారులు కోరారు. ఉద్యోగుల మొబైల్ ఫోన్లను, ఈ ఆఫీసుల్లోని ల్యాప్ టాప్ లను నిన్న అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పై కక్ష గట్టి సర్వేలపేరుతో దాడులు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తుండగా వీటిని కేంద్రం తోసిపుచ్చింది. బీబీసీ మాత్రం ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్టు స్పష్టం చేసింది.