కేంద్ర బడ్జెట్లో భారతీయ రైల్వే శాఖకు మరింత ప్రాధాన్యం కల్పించారు. ఈ శాఖకు వర్ధమాన ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2.40 లక్షల కోట్లను కేటాయించినట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇది ఈ శాఖకు అత్యధిక కేటాయింపుగా పేర్కొన్న ఆమె.. పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్ సఫర్, తేజాస్ వంటి ప్రీమియర్ రైళ్లకు వెయ్యికి పైగా బోగీలను అమర్చాలన్న యోచన ఉందన్నారు.
ఈ కోచ్ లు అత్యాధునికంగా ఉంటాయన్నారు. అలాగే పాత ట్రాక్ ల స్థానే కొత్తగా ట్రాక్ లను ఏర్పాటు చేయడం, రెళ్ళ వేగాన్ని పెంచడం, మరిన్ని ప్రాంతాలకు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం వంటివి ప్రభుత్వ లక్ష్యాల్లో భాగంగా ఉన్నట్టు ఆమె వివరించారు.
టూరిస్టులను ఆకర్షించేందుకు వందకు పైగా విస్తా డోమ్ కోచ్ లను తయారు చేయాలన్న యోచన కూడా ఉందన్నారు. 35 హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైళ్లను, కొత్తగా డిజైన్ చేసిన 4,500 ఆటోమొబైల్ క్యారియర్ కోచ్ లను, 58 వేల వ్యాగన్లను తయారు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించిందని ఆమె చెప్పారు.
2013-14 లో రైల్వే శాఖకు కేటాయించిన మొత్తంతో పోలిస్తే ఈ తాజా బడ్జెట్లో కేటాయింపులు తొమ్మిది రెట్లు ఎక్కువని నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ బడ్జెట్ ఫలితంగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ వంటి రైల్వే సంబంధ కంపెనీల షేర్లు పెరిగాయి.