న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ సర్కార్ పోడు రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పోడు రైతులకు జనవరిలోనే పట్టాలు మంజూరు చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. ఇప్పటికే గ్రామ,డివిజన్ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్తగా మూడు గిరిజన గురుకులాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆమె వివరించారు. ఆదివాసీలకు ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రపతికి వివరించినట్లు ఆమె తెలిపారు. శనివారం గిరిజన సంక్షేమ భవన్ లో ఆ శాఖ కార్యదర్శి క్రిస్టీనా, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, అదనపు డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, సీఈ శంకర్, జీసీసీ సీజేఎం సీతారాంనాయక్, ట్రైకార్ జీఎం శంకర్ రావుతో కలిసి ఆమె కేక్ కట్ చేసి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెరిగాయన్నారు. గిరిజన గురుకులాల్లో చదివిన 1,200 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఉన్నత విద్య చదువుకుంటున్నారని చెప్పారు. గిరిజనుల విదేశీ విద్య కోసం 20 లక్షల ఉపకార వేతనాలు ప్రభుత్వం ఇస్తుందన్నారు.
గిరిజన ఆవాసాలకు బీటీ రోడ్డు కోసం వెయ్యి కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా అంగన్ వాడీ లబ్ధిదారులైన చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారం ప్రభుత్వం అందిస్తుందన్నారు.