జార్ఖండ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అంజనేయ స్వామికి రైల్వే అధికారులు నోటీసులు ఇచ్చారు. 10 రోజుల్లోగా ఆలయాన్ని ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే… యూపీ నుంచి వలస వచ్చిన ఖాటిక్ తెగ ప్రజలు జార్ఖండ్‌లోని బెరక్‌బందల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. కూలీ పనులు చేసుకుంటూ గత 20 ఏండ్లుగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో వారంతా రైల్వేకు చెందిన స్థలంలో అక్రమంగా నివసిస్తున్న కారణంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు.
అదే ప్రాంతంలో అక్కడ ఉన్న హనుమాన్ దేవాలయంలో ఉన్న ఆంజనేయుడికి కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. 10 రోజుల్లో ఆలయాన్ని ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. లేకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
నోటీసుల్లో హనుమంతుడి పేరు స్పష్టంగా కనిపిస్తోంది. హనుమంతుడు రైల్వే భూమిలో ఆలయాన్ని నిర్మించుకున్నారని, అక్రమంగా ఆక్రమించుకున్న భూమిని వెంటనే ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందిన పది రోజుల్లోగా ఖాళీ చేసి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ విభాగానికి అప్పగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంజనేయస్వామిని అధికారులు హెచ్చరించారు.