దేశంలో లాక్ డౌన్ కారణంగా రైల్వే కూత కూడా మూగబోయింది. అయితే… దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేత నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, కొన్ని స్పెషల్ ట్రైన్స్ తో రైల్వే ప్రయాణికుల ప్రయాణాలు మొదలుపెట్టింది. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూ, కేవలం టికెట్ కన్ఫర్మ్ అయిన వారికి మాత్రమే స్టేషన్ లోకి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే… రైల్వే ప్రయాణం చేసే వారికి మాస్కులు తప్పనిసరి చేయటంతో పాటు థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయాలని రైల్వే నిర్ణయించింది. ఇక ఈ రెండింటితో పాటు కరోనా నివారణ కోసం కేంద్రం తెచ్చిన ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ప్రయాణికుడు డౌన్ చేసుకోవాలని ఆదేశించింది. అలా అయితేనే రైల్వే ప్రయాణానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఎవరికైనా కరోనా లక్షణాలున్నా, వైరస్ సోకిని తెలిసిపోతుందని…తద్వారా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు అవకాశం ఉంటుందని కేంద్రం సూచిస్తోంది. కొంతకాలంగా ప్రధాని సందేశాలన్నింటిలోనూ ఆరోగ్య సేతు యాప్ ను వాడండి అంటూ కోరుతున్నారు.
కానీ రైల్వే ప్రయాణాలు చేసే వారిలో ఎంతమందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అసలు ఎంతమందికి ఫోన్లు ఉన్నాయి అన్న అంశాలను ఎవరూ పట్టించుకున్నట్లు కనపడటం లేదు. పైగా ఆరోగ్య సేతు యాప్ వ్యక్తిగత డేటా ప్రైవసిపై అనేక అనుమానాలున్నాయి. వ్యక్తిగత డేటా ఎంతవరకు సేఫ్ అనేది తెలియటం లేదు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ యాప్ లో… ఆ ప్రైవేటు సంస్థ ఏదీ అనేది కేంద్రం బయటకు ప్రకటించలేదు.