సికింద్రాబాద్ అల్లర్ల కేసులో భాగంగా.. రైల్వే యాక్ట్ 1989 కింద మేడిపల్లిలోని సాయి డిఫెన్స్ అకాడమీకి రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24న ఆర్పీఎఫ్ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు. సాయి డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన అన్ని రికార్డులు, పత్రాలతో ఆర్పీఎఫ్ కార్యాలయానికి రావాలన్నారు. అకాడమీ కార్యాలయానికి తాళం ఉండటంతో గేటుకు నోటీసు అంటించినట్టు తెలుస్తోంది.
ఈ కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు పాత్రపై రైల్వే పోలీసులకు పక్కా ఆధారాలు లభించటంతో.. పోలీసులు అకాడమీపై కూడా దృష్టి సారించారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళనకు సంబంధించి అన్ని వ్యవహారాల్లోనూ సుబ్బారావు ప్రమేయం ఉందని రైల్వే పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈ ఘటనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అధికారులు సంచలన విషయాలను బయటపెట్టారు.
సికింద్రాబాద్ విద్వంసం కేసులో పలు విషయాలు వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు పాత్ర కీలకంగా ఉందని చెప్తున్నారు పోలీసులు. స్టేషన్ లో విధ్వంసం సృష్టించాలన్న ప్రణాళిక, కార్యాచరణను సుబ్బారావు వ్యూహమేనని అంటున్నారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు లభించాయని చెప్తున్నారు.
జూన్ 16న తన అనుచరులు శివ, మల్లారెడ్డితో గుంటూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న సుబ్బారావు.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్ లో దిగినట్టు గుర్తించారు. తన అనుచరుల ద్వారా ఆర్మీ అభ్యర్థులను రప్పించుకుని.. ఆ రాత్రి చర్చించినట్టు తెలిపారు. మూకుమ్మడిగా రైల్వేస్టేషన్ లోకి వెళ్లి దాడులు చేయాలని సూచించాడు. వారికి మద్దతుగా తన అనుచరులను మాస్కులతో రైల్వేస్టేషన్ కు పంపించాడు. ఆర్మీ అభ్యర్థులు విధ్వంసం మొదలుపెట్టిన కొద్దిసేపటికే గుంటూరుకు వెళ్లి పోయినట్టు రైల్వే పోలీసులు పేర్కొన్నారు.
ఈ దాడి కేసులో సుబ్బారావు ప్రమేయం ఉందని ముందు నుంచే అనుమానిస్తున్న పోలీసులు.. అతన్ని పట్టుకునేందుకు ఈ నెల 19న గుంటూరుకు వెళ్లారు. తనకు విధ్వంసానికి ఎటువంటి సంబంధం లేదని బుకాయించాడు సుబ్బారావు. దీంతో కేసు విచారణలో భాగంగా సహకరించాలని అతన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చారు పోలీసులు. బుధవారం ఉదయం రైల్వే పోలీసులు ప్రశ్నించినా తనకేం సంబంధంలేదని చెప్పాడు.
అప్పటికే వాట్సప్ గ్రూప్ చాటింగ్ ఆధారంగా సుబ్బారావు అనుచరులు శివ, మల్లారెడ్డితో పాటు.. మరో ముగ్గురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో వారు కీలక విషయాలను బయటపెట్టారు. సుబ్బారావుకు రైల్వే విధ్వంసానికి సంబంధం ఉందని..తమకు కొన్ని పనులు అప్పగించాడని వారు రైల్వే పోలీసులకు తెలిపారు. దీంతో గురువారం అర్ధరాత్రి సుబ్బారావు, అతడి అనుచరులను రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్టు ప్రకటించారు రైల్వే పోలీసులు.