అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన వారిలో ఇప్పటివరకు 46 మందిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సీ అనురాధ వెల్లడించారు. ఈ ఘటనలో మిగిలిన వారికోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఆర్మీ అభ్యర్థుల వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్ ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసి అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామన్నారు. పోలీసులు, ప్రయాణికులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని.. ఈ ఆందోళనల్లో రెండు వేల మంది వరకు పాల్గొన్నారని పేర్కొన్నారు.
అభ్యర్థులను రెచ్చగొట్టిన కోచింగ్ సెంటర్లను గుర్తించామని ప్రకటించారు. వాట్సాప్ గ్రూపుల్లో చర్చించి దాడికి పాల్పడ్డారని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లలో.. అరెస్టైన వారంతా తెలంగాణకు చెందిన వారేనని స్పష్టం చేశారు. రైల్వే యాక్ట్ 150 కింద నిందితులకు యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే చర్యలు తప్పవని అనురాధ హెచ్చరించారు.
విద్యార్ధులు ఇంతటి విధ్వంసానికి పాల్పడటానికి కారణం ఒక ట్రైనర్ అని తేల్చి చెప్పారు ఎస్పీ. ఒక కోచ్ ను పెట్రోల్ పోసి కాల్చేశారు వెల్లడించారు. మొత్తం 30 ట్రైన్ కోచ్ లు పూర్తిగా దగ్ధమయ్యాయని వివరించారు. వారికి సర్ది చెప్పాల్సిన కోచింగ్ సెంటర్లే వాళ్లనే రెచ్చగొట్టడం బాధాకరంగా ఉందన్నారు ఎస్పీ. ఈ మేరకు విద్యార్ధుల ఫైరింగ్ జరిపిన విషయమై ఎస్పీ స్పందించారు.
ఘటనా స్థలంలో.. లోకో ఇంజిన్, 4 వేల లీటర్ల ఆయిల్ ఉందని.. వాటిని కాల్చితే ఎక్కువ మరణాలు జరిగే ప్రమాదం ఉండటంతో ఫైర్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అందులో ఒక బులెట్, మిగిలినవి అన్ని 20 రౌండ్స్ పిల్లేట్స్ వాడినట్టు తెలిపారు. మొత్తం 58 కోచ్ లు నాశనం అయ్యాయని.. 12 కోట్లు ప్రభుత్వ ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ ఘటనల్లో 9 మంది రైల్వే సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. ఈ కేసును హైదరాబాద్ పోలీస్ లకు అప్పగిస్తున్నామని తెలిపారు ఎస్పీ అనురాధ.