లాక్ డౌన్ కారణంగా సాధారణ రైలు ప్రయాణాలు రద్దయి రోజులు గడుస్తుంది. ఓవైపు వలస కూలీల కోసం శ్రామిక్ రైళ్లు, 15 నగరాల మధ్య ప్రత్యేక రైళ్లు ఇప్పటికే నడుస్తున్నప్పటికీ… సాధారణ రైళ్లు ఇప్పట్లో నడవవని రైల్వే శాఖ ప్రకటించింది.
ప్రయాణికులు చాలా ముందుగా అంటే లాక్ డౌన్ కన్నా ముందు నుండే జూన్ 30వరకు రిజర్వేషన్లు చేసుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేనెట్ వర్క్ ఉన్న భారతీయ రైల్వేస్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ ట్రైన్స్ లో రిజర్వేషన్లు చాలా ముందు నుండి ఉంటాయి. ఇప్పుడవన్నీ రద్దు చేస్తున్నామని, పూర్తి రీఫండ్ వారి వారి అకౌంట్లలో జమ చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే, అప్పటి వరకు రైల్వేలు ఇచ్చే ప్రత్యేక రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. గత నెలలో రైల్వే శాఖ 94లక్షల టికెట్లకు 1490కోట్ల రీఫండ్ చేసినట్లు తెలిపింది. మొదటి విడత లాక్ డౌన్ సమయంలోని ప్రయాణాలకు 834కోట్ల రీఫండ్ చేసినట్లు తెలిపింది.
దశల వారీగా రైల్వే ప్రయాణాలు మొదలయ్యేలా చూస్తామని ప్రకటిస్తూ… ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. భౌతిక దూరంతో ప్రయాణాలను క్రమంగా పెంచేలా ప్రణాళికలు వేస్తున్న సమయంలో జూన్ 30వరకు ప్రయాణాలు రద్దుచేయటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.