ప్రపంచ దేశాల్లో సామాజిక, ఆర్ధిక వ్యవస్థల పెరుగుదల లేదా వ్యత్యాసాల్లో హెచ్చు తగ్గులెలా ఉన్నా..వీటికి చరిత్రాత్మక సంధికాలాలెన్నో ఉంటాయి. నాడు తమకు కలిగిన అనుభూతులు, అనుభవాలను ఇప్పుడు పలువురితో పంచుకుంటున్నవారు కొందరైతే..కాలానుగుణంగా సంభవించిన మార్పుల తాలూకు స్మృతులను ఆధారాలతో సహా పంచుకుంటున్నవారు మరికొందరు ! అది చిన్న పేపరైనా కావచ్చు.. వస్తువైనా లేదా మరొకటైనా కావచ్చు. అవి అమూల్యమైనవిగా, భద్రపరచుకోదగినవిగా ఉంటాయి.
పదాల్లో వర్ణించలేనివే ఇలాంటివి. భారత స్వాతంత్రోద్యమ కాలం నాటి ఓ రైలు టికెట్ ని ఎవరో ఇప్పుడు ఫేస్ బుక్ ద్వారా షేర్ చేస్తే అది వైరల్ గా మారి అనేకమందిని ఆశ్చర్యానికి గురి చేసింది. నాడు పాకిస్తాన్ లోని రావల్పిండి నుంచి ఇండియాలోని అమృత్ సర్ వరకు రైలు చార్జి అక్షరాలా 36 రూపాయల 9 అణాలు మాత్రమేనంటే నమ్మవలసిందే.. ఇది 1947 సెప్టెంబరు 17 వ తేదీ నాటి టికెట్., పైగా ఈ టికెట్ 9 మందికి జారీ చేశారు. నార్త్ వెస్టర్న్ రైల్వే ఇచ్చిన టికెట్ ఇది.
బహుశా ఈ 9 మందీ నాడు రైల్లో ఇండియాకు వలస వచ్చిన 9 మంది సభ్యుల కుటుంబానికి జారీ చేసినదై ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ పోస్ట్ చూసిన అనేకమంది దీన్ని తమ అభిప్రాయాలకు అనుగుణంగా మలచుకుంటున్నారు. గతానుభూతులను స్మరించుకునే పనిలో పడేందుకు ఈ పోస్ట్ వారికి ఊతమిచ్చింది. ఈ టికెట్ తాలూకు పోస్ట్ ‘గోల్డ్’ అని ఒకరంటే.. ఇది కేవలం కాగితం ముక్క మాత్రమే కాదని, పదిలంగా దాచుకునే స్మృతి అని మరొకరు కామెంట్ చేశారు. 1949 లో తన తండ్రి కొన్న కుట్టు మిషన్ క్యాష్ బిల్లును ఒకరు గుర్తు చేసుకున్నారు. 76 ఏళ్ళ నాటి అపురూపమైన ఈ రైలు టికెట్ ను భద్రంగా దాచుకుంటానన్నారు మరొకరు.