ఇప్పటికే న్యూఢిల్లీ, చత్రపతి శివాజీ టెర్మినల్ ముంబై, అహ్మదాబాద్ స్టేషన్ల పునరాభివృద్ధికి ఇంజనీరింగ్ సేకరణ, నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించిన భారత రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆనంద్ విహార్‌తో సహా 16 స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి భారతీయ రైల్వే తన పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రణాళికకు తిరిగి అమలు చేయాలని చూస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఆనంద్ విహార్, నిజాముద్దీన్, పాత ఢిల్లీ, విజయవాడ, దాదర్ కళ్యాణ్, పూణే, కోయంబొత్తూర్, బెంగళూరు సిటీ, బరోడా, భోపాల్, చెన్నై సెంట్రల్ స్టేషన్ లను ఈ ప్రణాళిక కింద పుణరుద్దరించాలని ఇండియన్ రైల్వే చూస్తోంది. ఈ మేరకు విషయాన్ని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తక్కువ ఖర్చుతో కూడుకున్న చోట, పీపీపీ విధానం ఆచరణీయంగా ఉండే ప్రాంతాలను అన్వేషిస్తున్నట్టు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రస్తుతం టెండర్ డాక్యుమెంట్లు తయారవుతున్నాయని పేర్కొన్నాయి. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ మానిటైజేషన్ నమూనాలు పరిశీలనలో ఉన్నట్టు చెప్పాయి.
ఈ 16 స్టేషన్ల అప్ గ్రేడ్ ప్రాజెక్టు బిడ్ విలువ రూ. 10,000 కోట్లకుపైగా ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ బిడ్ ల పై ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలోని వ్యక్తులు ఎక్కువ ఆసక్తిగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో రైల్వే ఇంజనీరింగ్ సేకరణ, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ)లకు మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని, ప్రాజెక్టు సాధ్యతలను బట్టి 200 స్టేషన్‌ల పునరాభివృద్ధికి పీపీపీ ద్వారా నిధులు సమకూర్చుకుంటుందన్నాయి.