రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలకు చెక్ పెట్టే దిశగా రైల్వే మంత్రిత్వ శాఖ ముందుకు సాగుతోంది. ఈ మేరకు ఓ ప్రత్యేక కారిడార్‌ను నిర్మించే పనిలో ఉంది. కారిడార్‌లో భాగంగా సుమారు 1000 వరకు ఫ్లై ఓవర్లు, భూగర్భ మార్గాలు నిర్మించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
ప్రస్తుతం 700 వరకు భూ గర్భ మార్గాలను, 300 వంతెనలను నిర్మిస్తున్నట్టు డీఎఫ్‌సీ ఎండీ ఆర్‌కే జైన్ తెలిపారు. ఇందులో ఇప్పటికే 550 ప్రాంతాల్లో భూగర్భ మార్గాన్ని నిర్మించినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రమాదాలు ఎక్కువ జరిగే 46 రైల్వే క్రాసింగ్ లను గుర్తించినట్టు చెప్పారు.
ఆయా ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు నిర్మించనున్నట్టు ఆయన వెల్లడించారు. డీఎఫ్‌సీ ప్రాజెక్టు అనేది ప్రమాద రహితంగా ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టుల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నట్టు ఆయన వివరించారు.
ఒకసారి ఈ భూగర్భ మార్గాలు, ప్లై ఓవర్లు నిర్మించాక గూడ్స్ రైళ్ల వేగం పెరుగుతుందన్నారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయని మరో అధికారి తెలిపారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ (డీఎఫ్‌సీసీ) ప్రకారం, తూర్పు, పశ్చిమ డీఎఫ్‌సీ మొత్తం 2,843 కి.మీ వరకు నిర్మించనున్నారు. ఇప్పటివరకు 50 శాతానికి పైగా రూట్ పనులు పూర్తయ్యాయని, 2023 చివరి నాటికి 90 శాతం మార్గం పూర్తవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.