గులాబ్ ముప్పు తెలంగాణకూ పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో తుపాన్ ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షిణ తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
జిల్లాల్లో కలెక్టర్లు, పోలీసులు, ఇతర శాఖలతో కలిసి పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువులపై ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉంచాలని తెలిపారు. అవసరమైన జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు.
ఇక రానున్న మూడు రోజులపాటు జీహెచ్‌ఎంసీలో హై అలర్ట్ ప్రకటించారు ఉన్నతాధికారులు. వర్షాలపై జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆయా శాఖల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండి.. అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.