పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర దిశగా ప్రయాణిస్తున్న జవాద్ తుపానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద హెచ్చరించారు. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ.. 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపారు.
విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 210 కి.మీ వేగంతో తుపాను పయనిస్తూ.. గోపాల్ పూర్ కు దక్షిణంగా 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు సునంద. దక్షిణ నైరుతిగా 390 కి.మీ వేగంతో పయనిస్తూ.. పారాదీప్ కు 470 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించారు. ఇది క్రమంగా బలహీనపడి ఉత్తర ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తున్నట్టు తెలుస్తోందన్నారు.
తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. గాలులతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సునంద.