- అతిభారీ వర్షాలు పడే జిల్లాల్లో ఆరెంజ్ జోన్
- రాష్ట్రంలోని మిగతా చోట్ల ఎల్లో జోన్
- ప్రాజెక్టులకు భారీగా వరదనీరు
తెలంగాణలో రుతుపవనాలు వేగంగా కదులుతుండటంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మోస్తరు కంటే ఎక్కువ వానలు పడ్డాయి. దీంతో పలు జిల్లాలో వాగులు,వంకలు పొంగిపొర్లాయి. పలు జిల్లాల్లో జోరు వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది.
హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణలో నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా చోట్ల భారీ వర్షాలు పడతాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. మిగతా చోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) వెల్లడించిన వివరాల ప్రకారం.. జూలై 9 వరకు హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నగరంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 32-33, 22-24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది.
కాగా, అప్పపీడనం ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిశాయి. వాతావరణ వాఖ వెల్లడించిన వివరాల ప్రకారం పలు జిల్లాల్లో వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సర్వాయిపేట్ లో 13.8 సెంటీమీటర్లు, పెద్దంపేటలో 13.3 సెంటీ మీటర్ల అతి భారీ వర్షం నమోదయ్యింది. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ లో 11 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. నిజామాబాద్ లోని రంజల్లో 9.7 , నిర్మల్ లోని దస్తురాబాద్ లో 9.6 పాత ఎల్లాపూర్ లో 8.9, జగిత్యాల లోని మెట్పల్లిలో 8.6, కుమ్రంభీం జిల్లాలోని వెంకట్రావుపేటలో 8.6, జైనుర్ లో 8.5 సెంటీ మీటర్ల వర్షం పడింది.
నిజామాబాద్ లోని లక్నంపూర్ లో 8 సెంటీమీటర్లు, నిర్మల్ లోని లింగాపూర్ లో 8.1, జగిత్యాలలోని కోరుటియాలో 8 సెంటీమీటర్లు, మంచిర్యాల్ లోని లింగాపూర్ లో 8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. నిజామాబాద్ లోని మదనపల్లిలో 7.9 సెంటీమీటర్లు, జగిత్యాల్లోని కొల్వాయిలో 7.8, నిజాంబాద్ లోని పొంకల్లో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెంలోని సత్యనారాయణపురంలో 7.7, నిజాంబాద్ లోని మల్కాపూర్ పల్దాలో 7.6 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదయ్యింది.
మరోవైపు భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు ఒక గేటు ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 692.900 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 12వేల 679 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6వేల 484 క్యూసెక్కులుగా ఉంది.