గత మూడు రోజులుగా భానుడు భగ భగ మంటూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. దాంతో నగరవాసులు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ తరుణంలో వరుణుడి రాకతో నగరవాసులకు కొంత ఉపశమనం లభించింది.
హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో మోస్తారు వర్షం కురిసింది. ఈ ఈదురుగాలులకు నాంపల్లిలో ఓ భవనంపై ఇనుప రేకులు ఎగిరిపోయాయి. అవి ఎగిరి వచ్చి రోడ్డు మీదున్న మూడు కార్లపై పడ్డాయి. దాంతో కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. కార్లలో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
సరూర్‌నగర్, గచ్చిబౌలి, కర్మన్‌ఘాట్, సైదాబాద్, అంబర్‌పేట్, చంపాపేట్‌లోనూ వర్షం కురుస్తోంది. నేడు, రేపు ఉరుములతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలిపింది.
నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ అరేబియా సముద్రం మాల్దివులు కొమోరిన్ ప్రాంతం దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వ్యాపించాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.