ఎండలు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్ర ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది.మూడు రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రమంతా విస్తరించడంతో రెండవ రోజు రాష్ట్రమంతా తడిసి ముద్దైంది.
మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ అత్యధికంగా రంగారెడ్డి జిల్లా సంగం గ్రామంలో 15.9 సెంటీమీర్లు, మహబూబ్‌నగర్ జిల్లా ఉడిత్యాలలో 15.6, నాగర్‌కర్నూల్ జిల్లా తోటపల్లిలో 13.6, కందుకూరులో 13.1, ఆమన్‌గల్ లో 12.6, వనపర్తిలో 12.5 మీర్కాన్‌పేటలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం పగలు కూడా పలు ప్రాంతాల్లో 6 సెంటీమీర్ల వరకు వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్, మెదక్ సహా మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్టగు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని వివరించింది. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉత్తర-దక్షిణ ఉపరితలద్రోణి ఏర్పడినట్టు ప్రకటించింది. దీంతో రెండ్రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెల్చి చెప్పింది వాతావరణ శాఖ.
నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భాగ్యనగర వాసులకు ప్రతి ఏటా మాదిరి ఈ ఏడాది కూడా తిప్పలు తప్పలేదు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై.. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. రహదారులపైకి వరద రావడంతో చెరువును తలపించాయి.