దేశంలోని పలు రాష్ట్రాల్లో విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ఎడతెరిపి లేని వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం మొదలైన వర్షాల కారణంగా వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. వర్షాల దాటికి పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో.. రైల్వే ట్రాక్ లు, వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది.
ఈ అకాల వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 27 జిల్లాల్లో సుమారు 1,089 గ్రామలు నీటమునిగాయి. సుమారు 6 లక్షల మంది వరదల ప్రభావానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకూ ఈ వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 9 కి చేరింది. అంతే కాకుండా వందల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లగా.. వరదల్లో చిక్కుకొని మూగజీవాలు, వన్యప్రాణులు మృత్యువాతపడుతున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, పోలీసులు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు వరద చేరిన ఇళ్లల్లో చిక్కుకున్న 3,427 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 142 పునరావాస శిబిరాలు, 115 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 48,000 మంది బాధితులకు ఆశ్రయం కల్పించారు.
వరద బాధిత జిల్లాలకు అస్సాం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం రూ. 1,000 కోట్లు మంజూరు చేసిందన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల సరఫరాను కొనసాగించేందుకు, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రైల్వే లింక్ పునరుద్ధరించడానికి దాదాపు 45 రోజులు పడుతుందని, రెండు-మూడు రోజుల్లో రోడ్డు కనెక్టివిటీని పునరుద్దరిస్తామని సీఎం తెలిపారు.