అల్వాల్ సర్కిల్ పరిధిలో ఈరోజు సాయంత్రం కురిసిన భారీ వర్షంతో జనజీవనం ఒక్కసారిగా స్థంభించిపోయింది. ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు కాలనీల రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి.
విద్యార్థులకు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ఓల్డ్ అల్వాల్, అల్వాల్, మచ్చబొల్లారం, వెంకటాపురం పరిసర ప్రాంతాల కాలనీలలో రోడ్లన్నీ నదీ ప్రవాహాన్ని తలపించాయి. ప్రధానంగా శ్రీబేకరీ, వెంకటాపురం రైల్వే బ్రిడ్జి, భూదేవనగర్, సాయిబాబా గుడి, మారుతీనగర్ నాలాలు పొంగడంతో వాహనదారులకు, బాటసారులకు ఇబ్బందిగా మారింది.
స్థానిక యువకులు వాహనాలను, బాటసారులను నీటి ప్రవాహం నుంచి దాటించారు. వర్షపు నీటికి తోడు డ్రైనేజీ నీరు రోడ్లపైకి రావడంతో ఆ నీటి నుంచి పోవాలంటే వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సర్కిల్ పరిధిలో వర్షాభావ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తద్వారా ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని డీసీ నాగమణి వివరించారు. ఎక్కడి కార్పొరేటర్లు అక్కడ ఆయా ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టారు.
దీంతో లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోగలుగుతున్నామని కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్, కిశోర్ గౌడ్ తెలిపారు.