హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని రెయిన్ బో ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కడప జిల్లా బద్వేలుకు చెందిన దేవేందర్ అనే బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని పిల్లాడి తండ్రి వేణుగోపాల్, బంధువులు నిరసనకు దిగారు.
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న దేవేందర్ ను… గత శనివారం తల్లిదండ్రులు రెయిన్ బో ఆసుపత్రి తీసుకొచ్చారు. పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. బాబుని రక్షించమని తల్లిదండ్రులు వేడుకున్నారు. అయితే ఓరోజు తర్వాత పిల్లాడు చనిపోయాడని చెప్పారు డాక్టర్లు.
ఆపరేషన్ తర్వాత బాబు ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు చెప్పలేదని అంటున్నారు పేరెంట్స్. పైగా మొత్తం డబ్బులు 7 లక్షలు తీసుకున్న తర్వాత చనిపోయినట్లు చెప్పారని ఆరోపిస్తున్నారు. రెయిన్ బో వైద్యులు తమ కుమారుడ్ని చంపడంతో పాటు… ఒక రోజు వరకు విషయాన్ని చెప్పకుండా డబ్బులు కట్టించుకున్నారని ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు, బంధువులు.