నైరుతి రుతుపవనాల రాకతో మొదటి రోజే వరణుడు దంచికొట్టాడు. బుధవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో రాష్ట్రమంతా ఒక్కసారిగా చల్లబడింది. భారీగా కురుస్తున్నా వార్షాలకు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు.
బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించిన సమయంలో సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిశాయని చెప్పింది.
రాష్ట్రంలో అత్యధికంగా భాగ్యనగర శివారులోని మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ ప్రాంతంలో 9.1 సెంటీమీటర్లు, చర్లపల్లిలో 9, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 8.3, కుమురం భీం రవీంద్రనగర్ లో 7.7, ఖమ్మంలో 7.6, బాచుపల్లిలో 7.1, కీసరలో 6.2, సింగపూర్ టౌన్‌షిప్ వద్ద 5.6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వర్షాలు లేని ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెప్పారు. మంగళవారం పగలు అత్యధికంగా భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. నైరుతి రుతుపవనాల ఏర్పడిన కారణంగా తెలంగాణతో పాటు.. ఇతర రాష్ట్రాల్లోనూ భారీ వార్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.