కొడుకు లేదా కూతురి పెళ్ళి ఘనంగా చేయాలనుకోవడం సాధారణ విషయం. ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు జరిపిస్తారు. వంద రకాలు వడ్డించడం దగ్గర్నుంచి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం వరకూ అన్నీ గొప్పగా జరిపించాలనుకోవడం ఈరోజుల్లో చాలా మామూలు విషయం.
కానీ ఓ కుటుంబం చాలా వినూత్నంగాను ,విడ్డూరంగాను పెళ్ళి జరిపించింది, శుభలేఖలు పంచినట్టుగా డబ్బులు పంచింది. పంచడం కాదు కరెన్సీ వెదజల్లింది. ఆకాశం నుంచి నుంచి నోట్లవర్షం కురిసిందా అన్నట్టుగా 100, 200, 500 రూపాయల నోట్లను ఇంటిపై నుంచి నోట్లను వెదజల్లింది.ఏరుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు.
మహేసాణా జిల్లా, కడీ తాలుకాలో ఇటీవల ఈ ఘటన జరిగింది. గడిచిన మూడు రోజుల నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డాబాపై ఉన్న ఓ వ్యక్తి రూ.500 నోట్లను గాల్లోకి వెదజల్లుతుండగా.. కింద ఉన్న వారంతా వాటిని అందుకునేందుకు ఎగబడటం వీడియోలో కనిపిస్తోంది.
ఒకరినొకరు తోసుకుంటూ నోట్లను అందుకునే ప్రయత్నం చేయడం వీడియోలో రికార్డ్ అయ్యింది. మాజీ సర్పంచ్ కరీంభాయి దాదుభాయి జాదవ్ మేనల్లుడు రజక్ వివాహం సందర్భంగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వారి కుటుంబంలో రజక్ ఒక్కడే మగ సంతానం అని, అందుకే ఇలా చేశారని సమాచారం.