ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి తడిసిపోతే అన్నదాతకు మిగిలేది కన్నీళ్లే. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామంలో ఇటీవల భారీ వర్షం పడింది. అప్పటికే స్థానిక రైతులు వరి నూర్పిడి మొదలుపెట్టారు. అందులో గనిపిశెట్టి శ్రీనివాసరావు అనే రైతు రెండున్నర ఎకరాల వరి కుప్పను ట్రాక్టర్ తో తొక్కించి ధాన్యం రాశి పోశాడు.
ఇంతలోనే అకాల వర్షం రైతు శ్రీనివాసరావును నిండా ముంచేసింది. ఎంతో కష్టపడి పండించిన పంట చేతికి రాక నీటి పాలైంది. పంట అంతా మొలకలు వచ్చేశాయి.
ఆరు నెలలు కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను అలా చూసి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు శ్రీనివాస్ రావు. పంటలో కొంత అన్నా పనికొస్తుందేమో అని మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఎండ బెట్టాడు.
దాదాపు లక్షన్నర రూపాయల వరకు నష్టపోయానని శ్రీనివాస్ చెప్తున్నాడు. స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, ముఖ్యమంత్రి జగన్ తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.