చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి గాలులతో పాటు.. కర్ణాటకపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీవర్షాలు కురిశాయి. అప్పటికప్పుడు ఏర్పడుతున్న క్యుములోనింబస్ మేఘాల వల్ల గంటల వ్యవధిలోనే కుంభవృష్టి కురుస్తోందని అధికారులు తెలిపారు.
వికారాబాద్ జిల్లా కోటిపల్లిలో 9.7 సెంటీమీటర్లు, దుద్యాలలో 9.4, ధవళాపూర్‌లో 8.7, మదనపల్లి, ధారూర్‌లో 6.2, తాండూరు, పుట్టపహాడ్‌లో 5.7, రంగారెడ్డి జిల్లా కసులాబాద్‌లో 5.6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు ప్రకటించారు. మరోవైపు ఖమ్మం జిల్లా పెనుబల్లిలో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించారు.
ఉపరితల ద్రోణి గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా ఆరేడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో అత్యధిక ఉష్ణోగ్రత 31.5 డిగ్రీలుగా నమోదుకాగా.. ఈ వేసవి మే నెలలో ఇంత తక్కువగా నమోదుకావడం ఇదే తొలిసారి. వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇటు.. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతం వరకూ విస్తరించాయి.