గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటీవల కుంభవృష్టి కురిపించిన అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లింది.
మళ్లీ తిరిగి భూమి పైకి వచ్చింది. ప్రస్తుతం ఒడిశా తీరంపై కేంద్రీకృతమై ఉంది.దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించడంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.
దీంతో రాష్ట్రంలో ఈరోజు భారీగా , రేపు ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఈ నెల 14,15 తేదీల్లో తగ్గిన వర్షాలు మళ్లీ 16 నుంచి వేగం పుంజుకున్నాయి.
రానున్న రోజుల్లో వర్షాలు భారీగా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలని పేర్కొన్నారు.ఒకవేళ బయటకు వచ్చినా కచ్చితంగా గొడుగును వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.