ఏపీ ప్రభుత్వానికి మద్యం ధరలు, సినిమా టికెట్ల రేట్ల మీద ఉన్న శ్రద్ధ.. పేదలపై లేదని ఆరోపించారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి. పేదలు ప్రయాణించే బస్ చార్జీలు పెంచడం దారుణమైన చర్య అని మండిపడ్డారు. ధనికులెవరూ బస్ లలో ప్రయాణించరనే విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అన్నారు.
తెలంగాణలో లేని బస్సు ఛార్జీల పెంపు, ఏపీలో ఎందుకు పెంచాల్సి వచ్చిందో సీఎం సమాధానం చెప్పాలని నిలదీశారు విష్ణు. వారివి మాత్రం బస్సులు కావా..? వారు వాడేది డీజిల్ కాదా..? అని ప్రశ్నించారు. అధిక ఛార్జీలతో పేదల కష్టాన్ని సొమ్ము చేసుకుంటూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
చిన్న సినిమాలను, పెద్ద సినిమాను ఒకేలా చూసిన ప్రభుత్వం.. సాధారణ బస్సులను, ప్రత్యేక బస్సులను ఒకేలా ఎందుకు చూడలేకపోతోందని ప్రశ్నించారు. పండుగ సమయాల్లో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతాయని.. ఈ నేపథ్యంలో 50 శాతం టికెట్ రేట్లు పెంచి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పెంచిన ప్రత్యేక ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి.