బీఆర్ఎస్ నేత, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర కమిటీ నాయకులు మాట్లాడుతూ… రాజకీయ పార్టీలు చేసుకునే దుర్భాషలు, దిగజారిపోయిన సంభాషణలు వింటునే ఉన్నామన్నారు.
కానీ పౌర సమాజం పై, క్షేత్ర స్థాయిలో రైతులతో పని చేసే కార్యకర్తల పై మంత్రి స్థాయి పదవిలో ఉన్న వ్యక్తి ఉరికించి కొడతామంటూ బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. అలాంటివి ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమైన పరిణామని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగానికి సంబంధించిన ఏ విషయంపైనా అయినా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
అయితే విషయాలపై చర్చించకుండా తమ నోరు మూయించే ప్రయత్నాలు చేయడం సరి కాదన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా రైతుల తరఫున తాము చేస్తున్న కృషిని కొనసాగిస్తామని అన్నారు. ప్రభుత్వం ఏదైనా తాము రైతాంగానికి సంబంధించిన అంశాలపై క్షేత్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పని చేస్తూ, మాట్లాడుతూ వచ్చామన్నారు.
2020 నుంచి కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగాను, కనీస మద్దతు ధర చట్టబద్ధత కోసం రైతు సంఘాల పోరాటంలో తాము పాల్గొన్నట్టు చెప్పారు. పంట నష్ట పరిహారం విషయంలో తాము హై కోర్టులో కేసు వేసి కేంద్రాన్ని జవాబుదారీ చేశామన్నారు. రాజకీయ పార్టీలకు, కొన్ని మీడియా సంస్థలకి మధ్య ఉన్న వైరుధ్యాలతో రైతు స్వరాజ్య వేదికకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు.
ఇలా రైతు సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రజా సంఘాలను బెదిరించడం ప్రజా స్వామిక ప్రభుత్వానికి తగదన్నారు. రైతు ఆత్మహత్యల అంకెల్లో చిన్న తేడాల విషయంపై కాకుండా రైతులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై రైతు బంధు అధ్యక్షుడు, తెలంగాణ ప్రభుత్వమూ స్పందించాలని డిమాండ్ చేశారు.
రైతు ఆత్మహత్యలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ రైతు స్వరాజ్య వేదిక నాయకులపై పల్లా రాజేశ్వర్ రెడ్డి నిన్న మండిపడ్డారు. అసత్య ప్రచారాలు చేస్తున్న ఆ నాయకులను ఉరికిచ్చి కొడతామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో పంట నష్టమే లేదని ఆయన అన్నారు.