పాలించేది మనోడైతే చాలు… ఆడిందే ఆట.. పాడిందే పాట. ఏం చేసినా.. జరిగినా అడిగేవాడు ఉండడు. టీఆర్ఎస్ లోని కిందిస్థాయి నేతలు కూడా ఇదే ధీమాతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎవరేం చేస్తారులే అని రైతు వేదికను పెళ్లి వేదికగా మార్చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో జరిగిందీ సంఘటన.
రైతులు, వ్యవసాయ అధికారుల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన వేదిక బాజాబజంత్రీలతో మారుమోగింది. అన్నదాతల ఉండాల్సిన వేదిక.. చుట్టాలతో సందడిగా మారింది. గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత కుమారుడి పెళ్ళిని రైతు వేదికలో ఘనంగా నిర్వహించాడు. దీనికి మరో టీఆర్ఎస్ నేత రూ.3వేలు తీసుకుని అనుమతి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
నిజానికి రైతు వేదికలపై పూర్తి అజమాయిషీ వ్యవసాయ శాఖదే. గ్రామ పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదు. పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు వాడుకోమనే రూల్ లేదని చెబుతున్నారు పరిగి ఏడీఏ వీరయ్య.