– రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్
– హాట్ టాపిక్ గా గవర్నర్ ఢిల్లీ టూర్
– ప్రోటోకాల్ విషయంలో తమిళిసై కీలక వ్యాఖ్యలు
– వెంటనే రియాక్ట్ అయిన మంత్రి జగదీష్ రెడ్డి
– కేసీఆర్ పై కేంద్రం ప్లాన్స్ మొదలైనట్టేనా?
– మొన్న ఐటీ రెయిడ్స్.. ఇప్పుడు గవర్నర్ ఇష్యూ..
– రానున్న రోజుల్లో దెబ్బ మీద దెబ్బ ఖాయమా?
అనుకున్నదే అయింది.. గవర్నర్ ఢిల్లీ పర్యటన తెలంగాణలో కాక రేపుతోంది. ఒకటా.. రెండా.. ఎన్నో అవమానాలు.. చూసీచూసీ విసుగొచ్చి ప్రధాని మోడీ దగ్గర మొత్తం చెప్పేశారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై. భేటీ తర్వాత కీలక విషయాలనూ వెల్లడించారు. దీంతో టీఆర్‌ఎస్ కూడా గవర్నర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రానికి రెండో గవర్నర్. తొలి మహిళా గవర్నర్. 2019 సెప్టెంబర్ 8న భాద్యతలు చేపట్టారు. అయితే.. ఆమె రాకపై మొదట్లో సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేసినా.. రాను రాను ఆయనలో చాలా మార్పు వచ్చింది. గవర్నర్ ను లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. కీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అసలు.. వివాదం ఎక్కడ మొదలైందని కొద్ది రోజులు వెనక్కి వెళ్తే.. హుజూరాబాద్ లో ఈటలను ఓడించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు కేసీఆర్. వాటిలో కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి జాయినింగ్ ఒకటి.
హస్తానికి హ్యాండ్ ఇచ్చి కౌశిక్ టీఆర్‌ఎస్ గొడుకు కిందకు చేరారు. దానికి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ ఇద్దామని గవర్నర్ కోటాలో ఫైల్ ను రాజ్ భవన్ కు పంపారు కేసీఆర్. కానీ.. కౌశిక్ రెడ్డి ఫైల్ విషయంలో బాగా లేట్ చేశారు తమిళిసై. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. క్రమక్రమంగా ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. రిపబ్లిక్ డే వేడుకల్ని రాజ్ భవన్ కే పరిమితం చేశారు. గవర్నర్ ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ అనేదే ఉండడం లేదు. కనీసం అధికారులు కూడా వెళ్లని పరిస్థితి. ఆఖరికి బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్నే లేకుండా చేశారు. ఈ గొడవలన్నీ ఎందుకులే అని ఉగాది వేడుకలకు కేసీఆర్ ను ఆహ్వానించారు తమిళిసై. కానీ.. ఆయన అటువైపు చూడలేదు. దీంతో ఎన్నాళ్లీ అవమానాలు అని భావించారో ఏమో.. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు గవర్నర్.
ప్రధాని మోడీతో భేటీ అయి రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు.. తనకు ఎదురైన అవమానాలు, గిరిజనుల సమస్యల గురించి వివరించారు. భేటీ అనంతరం తనపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బహిరంగంగా మొదటిసారి డైరెక్ట్ గా ఎటాక్ చేశారు. తాను వివాదాస్పద వ్యక్తిని కాదని.. అందరితో ఫ్రెండ్లీగా ఉంటానని.. ప్రభుత్వంతోనూ సఖ్యతగానే ఉండటానికి ప్రయత్నించానని చెప్పారు. తాను తెలంగాణలో అధికారం చెలాయించడం లేదన్న ఆమె.. ప్రధానికి అంతా తెలుసని వివరించారు. తనతో భేటీ కోసం సీఎం ఎప్పుడైనా ఆఫీస్ కు రావొచ్చని.. ఏ విషయంపై అయినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అవసరమైతే బహిరంగ చర్చకైనా సిద్ధమన్నారు. రాజ్ భవన్ ను, గవర్నర్ ను అవమానించారని.. అయినా కూడా తాను పట్టించుకోనని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ ప్రోటోకాల్ తెలియదా? అంటూ చురకలంటించారు. తనకు ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోవడాన్ని ప్రజలకే వదిలేస్తున్నానని తెలిపారు తమిళి సై.
అలా.. గవర్నర్ మీడియాతో మాట్లాడారో లేదో.. వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. గవర్నర్ వ్యవస్థ గురించి కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అన్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ రాజకీయాలను చొప్పిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం పంపిన ఫైళ్లను ఉద్దేశపూర్వకంగానే ఆపేశారని ఆరోపించారు. ఆమె మొదట్నుంచి ఫైళ్లు ఆలస్యం చేశారన్నారు. తమిళిసైకి సంయమనం తక్కువగా ఉందేమోనని అనుకున్నాం.. కానీ.. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని అర్థమైందని వ్యాఖ్యానించారు. తమిళిసై ఎవరి ఆజ్ఞల మేరకు ఇలా చేస్తున్నారో తెలియదన్న జగదీష్ రెడ్డి.. వ్యవస్థల మధ్య పంచాయితీ మంచిది కాదని కేసీఆర్ మొదట్నుంచి భావిస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం గవర్నర్ ఢిల్లీ టూర్ పై సర్వత్రా చర్చ నడుస్తోంది. నిజానికి కేసీఆర్ కు గవర్నర్ వ్యవస్థ అంటేనే ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు తమిళిసై బహిరంగంగా ప్రోటోకాల్ విషయంలో మాట్లాడడంతో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. రాజకీయ పండితులు మాత్రం కేసీఆర్ కు కష్టకాలం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. ఐటీ రెయిడ్స్, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపును డైవర్ట్ చేసేందుకే ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని బద్నాం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కేంద్రం ఆయనపై ఫోకస్ పెట్టిందని.. ఇప్పుడు గవర్నర్ ఇష్యూ అనేక మలుపులు తిరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.