– గవర్నర్ పై తెలంగాణ సర్కార్ పిటిషన్
– 10 బిల్లులు పెండింగ్ లో పెట్టారని కంప్లయింట్
– పిటిషన్ దాఖలు చేసిన చీఫ్ సెక్రటరీ
– ఆమోదించేలా తమిళిసైకి ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
– గవర్నర్ పరిధి ఏంటో తేల్చుకోవాలనుకుంటున్న సర్కార్
– పిటిషన్ తో దేశవ్యాప్తంగా ఇష్యూని తీసుకెళ్లాలని ప్రయత్నం
– రాజ్యాంగానికి లోబడే అంతా.. భిన్నంగా బీజేపీ వాదన!
– పిటిషన్ పై రేపు విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
చిన్న గ్యాప్ తరువాత మళ్లీ తెలంగాణ సర్కార్ వర్సెస్ రాజ్ భవన్ వార్ మొదలైంది. అయితే ఈ సారి ఈ ఫైట్ సుప్రీం కోర్టు దర్బార్ కు చేరింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు ఇలాగే హైకోర్టు వరకు వెళ్లిన వీరి పంచాయితీ.. సర్కార్ ఇంకా రాజ్ భవన్ మధ్య సమావేశాల విషయంలో అండర్ స్టాండింగ్ కుదరడంతో అప్పట్లో వీడింది. అయితే బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఉత్కంఠను రేపిన ఈ వార్.. పెండింగ్ బిల్లుల విషయంలో మాత్రం కంటిన్యూ అవుతూనే ఉండడమే ఇప్పుడు సుప్రీం వరకు వెళ్లి నువ్వా..నేనా అన్నట్టు మారింది.
గవర్నర్ తమిళి సై పై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించిన 10 బిల్లులను పెండింగ్ లో పెట్టారని.. ఆమోదించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ.. తెలంగాణ ప్రభుత్వమే సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. చీఫ్ సెక్రటరీ ఈ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేయడం విశేషం.
గవర్నర్ వ్యవహార తీరు బాగోలేదని.. ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకపోవటాన్ని తప్పుపడుతుంది ప్రభుత్వం. ఆరు నెలలుగా 10 బిల్లులను ఆమోదించకుండా తొక్కి పెడుతున్నారని వాదిస్తూ..గవర్నర్ పరిధి ఏంటీ.. ఎందుకు బిల్లులు ఆమోదించడం లేదనే విషయాన్ని సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
ఈ క్రమంలోనే పిటిషన్ దాఖలు చేస్తూ.. బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది సర్కార్. ఈ పిటిషన్ మార్చి 3వ తేదీన విచారణకు వచ్చే అవకాశముంది. రిట్ పిటిషన్ విచారణతో గవర్నర్ పరిధి ఏంటీ అనే విషయంలో స్పష్టత వస్తుందని..బీజేపీ పాలనలో గవర్నర్ల తీరును దేశవ్యాప్తంగా తీసుకెళ్లినట్టు అవుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.
ఈ ఉద్దేశంతోనే సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఇక ఈ విషయంలో బీజేపీ వాదన మరోలా ఉంది. రాజ్యాంగ పరిధిలో బిల్లులు అంటే.. గవర్నర్ ఆమోదిస్తారని.. రాజ్యాంగ పరిధికి భిన్నంగా ఉంటే బిల్లులను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నిస్తోంది బీజేపీ.
అధికారం ఉంది కదా అని చట్ట, న్యాయ, ప్రజా వ్యతిరేక బిల్లులను పంపిస్తే..రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ ఎలా ఆమోదిస్తారని ఎదురు దాడికి దిగుతోంది బీజేపీ. గవర్నర్ రాజ్యాంగానికి లోబడి పని చేస్తారని.. ప్రభుత్వాలు చెప్పినట్లు పని చేయరని బీజేపీ అంటోంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. సుప్రీం కోర్టులో విచారణపై ఆసక్తి నెలకొంది.