ఒక టాలీవుడ్ హీరో అతివేగంగా కారు నడిపి, అదే స్పీడ్ తో కారును డివైడర్ కి గుద్ది చిన్నపాటి గాయాలతో బయటపడి అక్కడ నుండి పరుగు లంకించుకున్నాడు. ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో గుప్పుమంటోంది. వివరాల్లోకి వెళ్తే నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ దగ్గర హైదరాబాద్ మార్గంలో ఉన్న కుడివైపు మలుపు దగ్గర ఆగస్ట్ 20వ తేదీ తెల్లవారు జామున టీ.ఎస్ 09 ఈ.ఎక్స్ 1100 నంబర్ గల కార్ డివైడర్ ను గుద్దుకుంది. ఆ వెంటనే అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి దిగి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
ముందుగా అంతా ఇది టాలీవుడ్ హోరో తరుణ్ కారని, యాక్సిడెంట్ అయిన వెంటనే కారు నుండి దిగి ఫోన్ చేసి వేరొక ఫ్రెండ్ ను అక్కడికి పిలిపించుకుని ఆ కారులో వెళ్ళిపోయాడని చెప్పుకొచారు. అయితే దీనిపై అది తన కార్ కాదని, తనకెలాంటి యాక్సిడెంట్ కాలేదని వివరణ ఇచ్చాడు. పోలీసులు సిసిటీవీ ఫుటేజ్ చెక్ చేసిన తర్వాత అది టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ అని నిర్ధారించారు. ఆ కార్ లీడ్ ఇండియా అనే కంపెనీ పేరుమీద రిజిస్టర్ అయినట్టు తెలిపారు. యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ కారు నుండి రాజ్ తరుణ్ దిగి ఫోన్ మాట్లాడుతూ అక్కడనుండి పరిగెట్టి వెళ్ళిపోయిన విజువల్స్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.
అది ఆటోమేటిక్ గేర్ తో నడిచే కారని, అతివేగంతో వస్తూ మలుపు దగ్గర స్పీడ్ కంట్రోల్ చెయ్యలేక డివైడర్ ను గుద్దేసినట్టు చెబుతున్నారు. ఈ ఘటనలో కారు బాగా ధ్వంసమయినా సమయానికి ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కేవలం చిన్నపాటి గాయాలతో రాజ్ తరుణ్ బయటపడ్డాడు. అయితే మరి ఆ సమయంలో రాజ్ తరుణ్ ఏమైనా మద్యం మత్తులో ఉన్నాడా అనే విషయాల గురించి అందరూ గుసగుసలు మొదలెట్టారు. పోలీసుల నుండి అధికారికంగా వివరాలు వచ్చిన తర్వాతే నిజానిజాలు బయటకు వస్తాయి. ఏదేమైనా యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మాత్రం తరుణ్ కాదు రాజ్ తరుణ్ అనే క్లారిటీ అయితే వచ్చేసింది.