బాల్యంలో గ్రామసీమల్లో పిల్లల స్కూళ్లకు సెలవులు ఇచ్చినప్పుడు బుర్రకథలు, సర్కస్‌లు, సైకిళ్లపై విన్యాసాలు, ఎన్నో జరుగుతూ ఉండేవి. చిన్నప్పుడు మొట్టమొదటిసారిగా ప్రాథమిక పాఠశాలలో నా వయసు పిల్లలు నాకంటే పెద్దవాళ్లు మరో నలుగురు, ఐదుగురు కలిపి ఆడిన సర్కస్ ఇప్పటికీ బాగా గుర్తు. మా పసి హృదయాలకు వారివి జీవన పోరాట సమస్యలని అప్పుడు అర్ధమయ్యేది కాదు. వారు కారణజన్ములు.. అద్భుత వ్యక్తులు అని భావిస్తూ ఉండేవాళ్ళం… అంటున్నారు రాజమౌళి
సర్కస్ కంపెనీ వాళ్లు రెండు గుంజల మధ్యలో ఒక వైరు కట్టి ఆ వైర్ మీద అద్భుతంగా ఒక కర్రను రెండు చేతులతో పట్టుకొని వస్తూ చాలా బ్యాలెన్స్‌తో నడిచి వెళ్లిపోయేవారు.
ఊపిరి బిగబట్టి చూసేవాళ్లం. గుండె వేగంగా కొట్టుకునీది. పడిపోతే వాళ్ళు ఏమైపోతారో అని భయం వేసేది. వాళ్లు పడిపోరు, ఎందుకంటే కారణజన్ములు కదా అనే ధైర్యం కూడా ఉండేది. వాళ్లు ఏ మాత్రం కాస్త తడబడినా నాన్నగారి చెయ్యి గట్టిగా పట్టుకుని ఉండేవాడిని. బాల్యంలో అమ్మకొంగు, నాన్న చెయ్యి ఎన్ని ఏనుగుల బలాన్ని, ఎన్ని మణుగుల ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయో బాల్యపు మధురానుభూతులు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు.
ప్రాథమిక పాఠశాల వదిలిపెట్టిన తర్వాత జీవన ప్రవాహంలో 30 సంవత్సరాలు ఎంత వేగంగా పరుగెత్తాయో తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా అందమైన జీవితం ఆ మొదటి పదేళ్ల రోజులే. ఆ తరువాత అంతా పరుగులే. ఈ పరీక్ష కోసం, ఆ రాంకు కోసం, ఉద్యోగం కోసం, పెళ్లి కోసం, పిల్లల కోసం, ఉద్యోగ ధర్మం కోసం…. ప్రతిరోజూ పరుగే. ఒక్కోసారి రోడ్డుమీద పరిగెత్తుతున్నామో, ట్రెడ్మిల్ మీద పరిగెత్తుతూ ఉన్నామో అర్థం కాని పరిస్థితి.
వైరుపై నడుస్తున్న పిల్ల.. కర్ర ఎందుకు పట్టుకుని నడుస్తోందీ అని నాన్నగారిని అడిగేవాడిని. కాళ్లు శరీరం పట్టు తప్పకుండా, ఒక వైపుకు శరీరం ఒరిగిపోకుండా బ్యాలెన్స్ చేయడానికి ఆ కర్ర ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అని నాన్నగారు వివరిస్తే, అది ఆ వయసుకి అంతగా అర్థం కాలేదు. సర్కస్ నాలుగైదుసార్లు చూశాను కానీ, అప్పుడప్పుడు ఆ నడిచే పిల్లలు ఒకవైపుకు ఒరుగుతున్నారు అనిపించిన వెంటనే వారు ఆ కర్రను రెండవ వైపుకు వొంచేవారు. పడిపోకుండా తమ గమ్యస్థానాన్ని చేరి ప్రేక్షకుల హర్షధ్వానాలు తీసుకొనేవారు. హర్షధ్వానాలతో పాటు ఎన్నో బహుమతులు కూడా వచ్చేవి. వాటిలో లాగు, చొక్కా, గౌను, బంతి, చెరుకుగడ, చిలకడదుంప, పెన్సిల్, సెంటు రబ్బరు ఇలా ఎన్నో బహుమానాలు ఉండేవి. కొంత చిల్లర డబ్బులు, అక్కడక్కడ చిన్ననోట్లు కూడా కనిపించేవి. ప్రదర్శన అయిపోయిన తర్వాత వాళ్లు ఇంటింటికి తిరిగి బియ్యం, కూరగాయలు, ఉప్పు పప్పు లాంటివి సేకరించుకునే వారు. వాళ్లు మా ఇంటికి వచ్చినప్పుడు నేను అమ్మకు చాలా గట్టిగా సిఫారసు చేసి ఎక్కువ బియ్యం ఇప్పించేవాడిని. తాతగారు అయితే ఆ సర్కస్ కంపెనీ వారికి వాళ్ల టైర్ల బండి లాక్కోవడానికి అనువుగా ఉంటుందని ఒక కోడెదూడను కూడా ఇచ్చినట్టు గుర్తు. సర్కస్‌లో తీగ మీద నడిచిన పిల్లవాడికి అమ్మ చూడకుండా ఓ అరడజను అరిసెలు కూడా ఇచ్చినట్టు నాకు బాగా గుర్తు.
వేగంగా పరిగెత్తిన ఈ 30 సంవత్సరాలలో ఎన్నో సంతోషాలు-దుఃఖాలు, ఉత్సాహాలు- నిరుత్సాహాలు, నిగ్రహాలు-నిట్టూర్పులు, కష్టాలు-సుఖాలు. 7వ తరగతిలో ఫస్ట్ ర్యాంకు వస్తే నేను చాలా కష్టపడి చదివి బాగా రాశాను అని చెప్పేవాడిని. ఎనిమిదో తరగతిలో మార్కులు తగ్గితే పేపర్ కష్టంగా ఉందని అనేవాడిని. పరుగుపందెంలో ఓడిపోతే మిగతా వాళ్లు నా కంటే సన్నగా ఉన్నారని బాధపడుతూ చెప్పేవాడిని. అదే కబడ్డీలో గెలిస్తే అంతా నా ప్రతిభ అనేవాడిని. ఎండాకాలం వస్తే శీతాకాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాడిని. శీతాకాలంలో ఎండా కాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాణ్ని. హిందీ పరీక్షలో చేతిరాత బాగోక మార్కులు తగ్గితే మాస్టర్ గారు సరిగా దిద్దలేదని చెప్పేవాడిని. డిబేట్‌లో ద్వితీయ బహుమతి ఎందుకు వచ్చింది అని అడిగితే జడ్జిగారు మొదటి ప్రైజ్ వచ్చిన వారి పట్ల పక్షపాతం ప్రదర్శించారని గట్టిగా వాదించేవాడిని.
అనుకూల ఫలితంలో ఆత్మవిశ్వాసం, ప్రతికూల ఫలితంలో అధైర్యం అనివార్యంగా వెంబడిస్తూ ఉండేవి. అనుకూల ఫలితం వచ్చినప్పుడు నా మీద నాకు నమ్మకం పెరిగేది. నా దృష్టిలో నా స్థాయి పెరిగేది. అలాగే ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు నా మేధో పుష్పాలు వాడిపోయేవి. ఒక ఆనందం కలిగితే…అదేమిటో ఏదో ఒక బాధ వెంటనే వెంటాడేది. పదో తరగతిలో ర్యాంకు వచ్చిందని ఆనందపడుతూ ఉంటే, కోరుకున్న కాలేజీలో ఇంటర్మీడియట్ సీటు రాక ఎంతో నిరుత్సాహ పరిచింది. ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌లో ర్యాంకు వచ్చింది. ఆ ఆనందం ఆవిరవకుండానే కోరుకున్న కోర్సు రాదని బాధ పెరిగింది. ఇంజినీరింగ్ గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కామెర్లతో మంచాన పడాల్సి వచ్చింది.
అనుకున్న ఫలితం వచ్చినప్పుడు నాన్నగారు చిరు మందహాసం చేసేవారు. ప్రతికూల ఫలితం వచ్చినప్పుడు కూడా నాన్నగారి రియాక్షన్ అదేవిధంగా ఉండేది. నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడైనా అత్యంత ఆనంద క్షణాలు గడిపిన తరువాత ఏదో విధమైన దుఃఖం వెన్నాడేది. అలాగే అత్యంత కష్ట సమయాన్ని అనుభవించిన తరువాత ఎంతో ఆనందదాయకమైన సమయం వచ్చేది. కోరుకున్న కాలేజీ రాకపోయినా వచ్చిన కాలేజీ వ్యక్తిత్వాన్ని ఎంతో ప్రభావితం చేసింది సంస్కృతానికి గొప్ప గురువు దొరికారు. ఇంజినీరింగ్‌లో చేద్దామనుకున్న బ్రాంచ్‌లో చేయకపోయినా చేసిన బ్రాంచ్‌లో అత్యంత సంతృప్తి లభించింది. ప్రొఫెసర్లు అందరూ సీనియర్‌లే. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సబ్జెక్టులో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కామెర్ల బారిన పడిన తర్వాత ఆహార నియమాలు అన్నీ పూర్తిగా మార్చుకున్నాను. సంపూర్ణ సాత్విక ఆహారానికి మారిపోయాను. నన్ను నేను గమనించే తీరు, ప్రపంచాన్ని చూసే తీరు, ఎదుటి వ్యక్తిని ఎదుటివారి ఆలోచనలను అర్థం చేసుకునే అవగాహన చాలా చాలా అభివృద్ధి పొందాయి.
ఒకరోజు నాన్నగారిని అడిగాను.. ‘చిన్నప్పుడు డజనుమందిమీ హాయిగా కూర్చుని ఆడుకునే వాళ్ళం. ఇల్లు ఎంతో పెద్దదిగా విశాలంగా కనిపించేది. నుయ్యి ఎంతో లోతుగా కొబ్బరిచెట్లు ఎంతో ఎత్తుగా కనిపించేవి. కానీ ఇప్పుడు ఇవన్నీ ఎంతో చిన్నగా అనిపిస్తున్నాయి కారణం ఏమిటి’ అని అడిగాను. ‘నువ్వు పెరిగావు కదా’ అన్నారు ఠక్కున. అవును నేను పెరిగాను. శారీరకంగాను మానసికంగానూ చాలా పెరిగాను. నాన్నగారు ఎందుకు మందహాసం చేసేవారో క్రమేణా అర్ధం అయ్యింది. జీవితం ఒక పాఠశాల. మనం ఎన్నో పాఠాలు ప్రతిదినము నేర్చుకుంటాం. కొన్ని పాఠాలు కఠినంగా ఉన్నా మంచి భవిష్యత్తుకు మార్గాలు వేస్తాయి. కాలం కఠినంగా ఉన్నదని కుంగటం, బాగుందని పొంగటం రెండూ తాత్కాలికమే. కష్టసుఖాలు కావడిలో కుండల్లాంటివి. ప్రతి మనిషి జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఇది. బాల్యంలో కావడి భుజాన మోసిన వారికి ఇది తేలికగా అర్ధం అవుతుంది. బాల్యంలో చూసిన సర్కస్ గుర్తుకొచ్చింది. ఒకవైపు ఒరిగిపోబోతుంటే చేతిలో కర్రను రెండో వైపుకు వంచి బ్యాలెన్స్ నిలబెట్టుకున్న సర్కస్ పిల్లలు గుర్తొచ్చారు. తీగ మీద నడుస్తూ నిబ్బరంగా, నిగ్రహంగా, నిర్వికారంగా రెండు వైపులూ బాలన్స్ చేస్తున్న వాళ్ళ నైపుణ్యం నెమరు వేసుకున్నాను. సుఖదుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, ఎత్తుపల్లాలు, మంచి చెడ్డలు జీవితానికి రెండు వైపులు. చేతిలో ఉండే అడ్డ కర్ర మనసు, మన ఆలోచనలు. శరీరం ఎటు ఒరిగితే దానికి మరోవైపుకు కర్రను ఒంచటం, బాలెన్సు నిలుపుకోవడం అంటే.. కష్టాల మూలం సుఖం అనీ, సుఖాల పునాది కష్టం అన్న శాశ్వత సత్యాన్ని పదేళ్ల వయసులో వాళ్ళు ప్రదర్శించగా, అదే వయసులో నేను వారి జీవనయానంలో వారి జీవన ఉపాధి కళ నుంచి అంత లోతుగా అర్ధం చేసుకోలేకపోయాను. నేను జీవన ప్రవాహంలో మరో ముప్పది సంవత్సరాలు ప్రయాణిస్తే గానీ తెలుసుకోలేకపోయాను. ‘కలిమి లేములు, కష్ట సుఖాలు, కావడి కుండల్లాంటివని, బాధే సౌఖ్యమనే భావన వస్తే అంతకు మించిన నిశ్చలత్వం ఉండద’నే సముద్రాల గారి మాటల ముత్యాలు. నిజంగా మహామంత్రాలు. జీవన ప్రయాణ అవరోధాలు, ప్రవాహ ఆటుపోట్లకి తట్టుకు నిలబడే ఆనకట్టలు. ఈ మంత్రాలు సాధన చేసే వారంతా కారణ జన్ములే!