యూపీ ఓటర్లను బెదిరించారని ఎన్నికల సంఘం పంపిన నోటీసులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. 24 గంటల్లో ఈసీ వివరణ కోరిందని తెలిపారు. తానేమీ తప్పుగా మాట్లాడలేదని… ఎస్పీ హయాంలో పరిస్థితి ఎలా ఉండేదో.. ఇప్పుడు రాష్ట్రం ఎలా ఉందో మాట్లాడానని అన్నారు. అప్పట్లో యూపీలో గూండాల రాజ్యం నడిచేదని.. హిందువులు, రైతుల భూములను కబ్జాలు చేస్తుండేవారని తెలిపారు. కానీ.. యోగి సర్కార్ వచ్చాక కబ్జాలు చేసిన స్థలాల్లో పేదలకు లక్షల ఇళ్లు కట్టించారని చెప్పారు. ఈ అంశంపైనే తాను వ్యాఖ్యలు చేశానని వివరించారు.
యోగి మరోసారి అధికారంలోకి రాకుండా ఉండేందుకు కుట్ర జరుగుతోందన్న రాజాసింగ్.. అఖిలేష్ అధికారంలోకి వస్తే ఏమవుతుందో వివరించానని అన్నారు. యోగి మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఉజ్జయినిలో మూడు రోజులపాటు పూజా కార్యక్రమాలు చేస్తున్నానని.. అవి ముగించుకుని వచ్చాక లాయర్ ద్వారా నోటీసుకు సమాధానం ఇస్తానని చెప్పారు రాజాసింగ్.
రెండు రోజుల క్రితం యూపీ ఓటర్ల గురించి మాట్లాడుతూ.. ఓటు వేయని వాళ్ల జాబితా తీసి వాళ్ల ఇళ్ల పైకి బుల్డోజర్లు ఎక్కిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీఆర్ఎస్ సోషల్ మీడియా దీన్ని బాగా హైలెట్ చేసింది. మంత్రి కేటీఆర్ సైతం స్పందిస్తూ.. బీజేపీలో మరో అద్భుతమైన హాస్యనటుడు బయటపడ్డారని సెటైర్లు వేశారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ను ట్విట్టర్ మ్యాన్ అని అభివర్ణించారు.
తెలంగాణలో పెద్ద జోకర్ ఎవరో ప్రజలకు తెలుసన్నారు రాజాసింగ్. అసెంబ్లీలో మాట ఇచ్చి.. బయట అబద్దాలు చెప్పేది ఎవరో చూస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. యూపీలో యోగి సర్కార్ వచ్చాక క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. తాను మాఫియా వాళ్లను, అక్రమార్కులను మాత్రమే హెచ్చరించానని.. అందర్నీ అన్నట్లుగా టీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ కు, కేటీఆర్ కు పని లేదని.. సోషల్ మీడియాలో బీజేపీ బురద జల్లించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. దేశ ద్రోహ్రులు, ధర్మ ద్రోహ్రుల ఇళ్లను ముమ్మాటికీ బుల్డోజర్లతో కూల్చేస్తామని మరోసారి స్పష్టం చేశారు రాజాసింగ్.
రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులు పంపింది. ఓటర్లను బెదిరించినట్టుగా ఉందని 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నోటీసులపై స్పందించిన రాజాసింగ్ ఈసీకి వివరణ ఇస్తానని తెలిపారు.