ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. బండి సంజయ్ వ్యాఖ్యలను ఎంపీ అరవింద్ సహా పలువురు సీనియర్లు తప్పు పట్టారు. ఇది ఇలా వుంటే తాజాగా దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
బండి సంజయ్‌పై అరవింద్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఏదైనా వుంటే సంజయ్‌తో అరవింద్ నేరుగా మాట్లాడి వుండాల్సిందన్నారు. బండి సంజయ్ వ్యక్తి గత హోదాలో మాట్లాడటం లేదని పార్టీ అధ్యక్ష హోదాలో మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు.
ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు వుంటే సంజయ్‌తో అరవింద్ నేరుగా మాట్లాడవచ్చన్నారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మంచి స్పందన లభిస్తోందన్నారు. త్వరలో రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చే అవకాశమూ ఉందని ఆయన చెప్పారు.
ఇలాంటి సమయంలో ఒకరిపై ఒకరు కామెంట్లు చేయడం సరికాదని సూచించారు. ఎంపీ అరవింద్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏవో ఫ్లోలో అన్న మాటలపై ఇలా విమర్శలు గుప్పించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఆలోచన చేయాలంటూ ఆయన కోరారు.