ఎవరి కిందపడితే వారికింద పనిచేయలేనని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. క్యారెక్టర్ లేనోళ్లు పార్టీలో పెత్తనం చేస్తుంటే బాధేస్తోందని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరుతున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన రాజగోపాల్ రెడ్డి ఏది చేసినా ప్రజలకు చెప్పే చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తో పోరాడే పార్టీతోనే తన ప్రయాణం చెప్పారు రాజగోపాల్ రెడ్డి. సొంత పార్టీలోనే తనకు ఆదరణ కరవైందని తెలిపారు. గౌరవం ఇవ్వని చోట తాను ఉండలేనని స్పష్టం చేశారు. మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్న ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో ఆంధ్రా కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు దోచి పెట్టారని ఆరోపించారు.
శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రి భవనాలను పునరుద్ధరణ చేయకుండా.. ఇప్పుడు కొత్త ఆసుపత్రులు కడతామని కేసీఆర్ చెబుతున్నారని మండిపడ్డారు. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండి ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోలేదు గానీ.. ఇప్పుడు మన ఊరు-మన బడి అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చమని కేసీఆర్ పై చురకలంటించారు రాజగోపాల్ రెడ్డి.
నిజానికి రాజగోపాల్ రెడ్డి గతంలోనే పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరిగింది. తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో కాషాయ కండువా కప్పుకుంటారని అంతా అనుకున్నారు. అయితే.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఆదరణ కరువైందని అంటున్నారు. దీంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.