కాంగ్రెస్‌కు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అధికారికంగా గుడ్ బై చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు రాజీనామా లేఖను పంపారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌లో 30ఏళ్లు సుశిక్షితుడైన కార్యకర్తగా పనిచేశానని వెల్లడించారు. ఏ పని అప్పగించినా రాజీపడకుండా పార్టీ కోసం పనిచేశానని తెలిపారు. కష్టాలను దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ఠ కోసం పాటుపడ్డానని వివరించారు.
ఎందరో త్యాగాలు..అందరి పోరాటంతో సాకారమైన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం కేసీఆర్ కుటుంబంలో బంధీ అయిందని విమర్శించారు. ఈ బంధీ నుంచి విడిపించేందుకు తెలంగాణలో మరో ప్రజాస్వామ్య పోరాటం అవసరమన్నారు. అందుకే ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఈ నెల 8న రాజగోపాల్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు స్పీకర్. ఆ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.
గడిచిన కొంతకాలంగా పార్టీకి పూర్తి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తూ, విస్మరిస్తున్న పార్టీ ద్రోహులకు కీలక బాధ్యతలు అప్పగించటం తనను తీవ్రంగా బాధించిందంటూ రాజగోపాల్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే అనేక పార్టీలు మారి, స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేసి జైలుపాలైన వ్యక్తి ఆధ్వర్యంలో కలిసి పనిచేయలేనని ఆయన వెల్లడించారు.
తెలంగాణాలో మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నమ్ముతున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సబ్బండవర్గాలు కోరుకున్న ప్రజా తెలంగాణలో, ప్రజాస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని లేఖలో తెలిపారు.