– దూకుడు పెంచిన కమలదళం
– అభ్యర్థిగా రాజగోపాల్ పేరు ప్రకటన
– పార్టీ ఆఫీసులో స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్
– నర్సాపూర్ బహిరంగ సభపైనా చర్చ
మునుగోడు నోటిఫికేషన్ రాకతో బీజేపీ దూకుడు పెంచింది. గెలుపు వ్యూహాలపై సమావేశాలు, వ్యూహాలతో బిజీగా ఉంది. పార్టీ ఆఫీస్ లో స్టేట్ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ సహా కీలక నేతలు, పదాధికారులు పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా గెలుపు ప్రణాళికలపై మాట్లాడుకున్నారు.
ఇటు మెదక్ జిల్లా నర్సాపూర్ బహిరంగ సభ పైనా చర్చ జరిగింది. ఆదివారం జరిగే ఈ సభకు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ హాజరవ్వనున్నారు. అలాగే రాష్ట్ర నేతలంతా హాజరవనున్నారు. ఈ సభలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, పరకాల మాజీ ఎమ్మెల్యే భిక్షపతి బీజేపీలో చేరనున్నారు. శుక్రవారం సభా ఏర్పాట్లపై ఈటల రాజేందర్ పరిశీలించారు. ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అధికారికంగా ప్రకటించింది బీజేపీ. ఆయన సోమవారం నామినేషన్ వేయనున్నారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలకు, కేసీఆర్ కు మధ్య ఈ పోటీ జరుగుతోందన్నారు. ఈ ఎన్నిక రాష్ట్ర, దేశ రాజకీయాల మీద ప్రభావం చూపుతుందని తెలిపారు.
మునుగోడులో జరుగుతున్న ధర్మయుద్ధంలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాజగోపాల్. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ కుటుంబం బాగుపడిందని ఆరోపించారు. మునుగోడులో బీజేపీ గెలిచిన నెల రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమన్న ఆయన.. కేంద్రంలో మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.