– అమిత్ షాతో భేటీ.. చేరికపై చర్చలు
– తనతోపాటు చాలామంది వస్తారన్న రాజగోపాల్
– వెంకట్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకుంటారని వెల్లడి
– కాంగ్రెస్ తప్పుడు వ్యక్తుల చేతుల్లో ఉందని విమర్శలు
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికపై క్లారిటీ వచ్చేసింది. ఈనెల 21న అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఢిల్లీలో అమిత్ షాతో రాజగోపాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరికపై చర్చలు జరిగాయి. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు రాజగోపాల్. రాజీనామా లేఖ ఇవ్వడానికి స్పీకర్ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈనెల 8న స్పీకర్ లేకున్నా.. అసెంబ్లీ సెక్రటరీకి లేఖ ఇస్తానన్నారు.
తనతోపాటు బీజేపీలోకి చాలామంది చేరుతున్నారని తెలిపారు రాజగోపాల్. రాష్ట్రంలో ఉపఎన్నిక వస్తేనే నిధులు వచ్చే పరిస్థితి ఉందని.. కేసీఆర్ కు కనువిప్పు కలిగేలా మునుగోడు తీర్పు ఉంటుందన్నారు. అభివృద్ధి సిద్ధిపేట, సిరిసిల్లలకే పరిమితమైందని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నిక తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తెస్తుందని.. ప్రజలు ధర్మం వైపు ఉంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ ను విమర్శించడమే రేవంత్ రెడ్డి చేసిన పెద్ద తప్పు అని, డబ్బులు ఇచ్చి మాత్రమే పీసీసీ చీఫ్ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని.. బయటనుంచి వచ్చిన వ్యక్తికి పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టారని విమర్శించారు. ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి తాము కష్టపడాలా అని ప్రశ్నించారు. తాను బీజేపీకి అమ్ముడుపోయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి తన సవాల్ స్వీకరించాలని చెప్పారు. రేవంత్ రెడ్డికి క్యారెక్టర్, క్రెడిబులిటి లేదన్నారు.
ఇక తన అన్న వెంకట్ రెడ్డి కూడా త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. చెరుకు సుధాకర్ చేరిక పట్ల ఆయన అసతృప్తితో ఉన్నట్లు చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు తగిన గుర్తింపు లేదని.. తమకు పదవులు ముఖ్యం కాదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధానమని చెప్పారు.