బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నిర్మల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎన్నికలుండే అవకాశం ఉందన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికార దుర్వినియోగంతోనే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచిందని విమర్శించారు.
బీజేపీకి పెరుగుతున్న ఆదరణతో ముఖ్యమంత్రి కేసీఆర్ లో భయం నెలకొందన్న రాజగోపాల్.. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, ఆ పార్టీలో బలమైన నాయకుల్లేరని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలోచించి బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో పది స్థానాల్లో బీజేపీని గెలిపించే బాధ్యత తనదని స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి.
మరోవైపు తెలంగాణలో బీజేపీ బలపడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆత్మీయ సమ్మేళనంలో చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇది ముందు నుంచి చెప్తూనే ఉన్నానని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు గొప్పలు చెప్పుకునేది కాదని సెటైర్లు వేశారు. వాళ్ళు ఎలా గెలిచారు అనేది అందరికి తెలుసని.. తాను ప్రచారం చేసే సమయంలో బెదిరించారని అన్నారు.
ఈమధ్య జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బీజేపీ బలపడుతోందని టీఆర్ఎస్ నేతలు అన్నారు. ఇప్పటి వరకు చాలా ఈజీగా గెలిచామని.. కానీ ఇక మీదటే అసలైన పోటీ ఉంటుందని చెప్పారు. ఓవర్ కాంఫిడెన్స్ తోనే ఓడిపోతున్నామని, కనీసం చేసిన పనులని కూడా చెప్పుకోలేకపోతున్నామని అన్నారు. ఆ వ్యాఖ్యలనే గుర్తు చేస్తూ రాజగోపాల్ సెటైర్లు వేశారు.