రాజమౌళి
చిన్నప్పటి నుంచి నాకు పొలం గట్ల మీద నడవటం సరదా. ఎవరికైనా సరదాగానే ఉంటుంది. ఒక పక్క నీరు మరొక పక్క పచ్చని పొలము, మధ్యలో ఎగిరిపడుతున్న చేప పిల్లలు పాకుతున్న పీతలు, గట్టు మీదమంచు బిందువులతో కలిసి ఉన్న మెత్తని చల్లని చిక్కని పచ్చని పచ్చగడ్డి. అందుకే అమ్మ, తాతయ్యకి పొలంలో అన్నం ఇచ్చి రమ్మంటే వేగంగా ఉత్సాహంగా పరిగెట్టేవాణ్ణి.
ఆ గట్లు కూడా అలాగే ఉండేవి. దృఢంగా బలంగా పొలానికి పొలానికి మధ్య రహదారిలాగా పొలాలని వేరు చేస్తూ, ప్రతి పొలానికి దాని సరిహద్దులను గుర్తు చేస్తూ, ప్రతిపొలం తన ఉనికిని కాపాడుకునేలా ఉండేవి. గట్లమీద బంక నేరేడు చెట్ల కింద ఆడిన ఆటలు సరే సరి. తుఫానులు వచ్చినప్పుడు గట్లకు గండ్లు పడేవి. అసలు ఈ గట్లు ఎందుకు…?ఇవి లేకుండా ఉంటే గండ్లు పడవు కదా.. అని తాతయ్యని అడిగితే… పొలానికి గట్టు, ఇంటికి దడి, మనిషికి మడి మన ఉనికి కోసం రక్షణ కోసం ఆరోగ్యం కోసం పెట్టినవి. వాటిని కాపాడుకోవాలి అనేవాడు. తుఫాను వచ్చినపుడు కొన్ని గట్లు చిన్న గండ్లు పడేవి. తాతయ్య మనుషులను తీసుకెళ్లి గండ్లు పూడిపించే వాడు. సమయానికి గండ్లు పూడ్చకపోతే చేను అస్తిత్వం కోల్పోయే పరిస్థితి వస్తుంది అనేవారు. గట్లు పోయిన చేలో నీరు నిలువదు. ఎరువు ఇంకదు. పంట బలంగా పెరగదు. హద్దు ఉండదు.. అందుకే బలమైన గట్లు అవసరం అనేవాడు.
ఆ గట్ల మీద నడిచే వారు వాటి మీదే సేదతీరటం వాటి మీద చెట్ల కింద అన్నాలు తినటం… లాంటివి చేసేవారు. ప్రతి సంవత్సరం ఆ గట్లను ప్రతి వేసవి కాలంలో కొన్ని పొడి మట్టి దిబ్బలు వేసి సుదృఢంగా చేసేవారు. ఎడ్లబండి మీద పొలానికి వెళ్ళినప్పుడు ఎడ్లు కూడా గట్లను దాటేటప్పుడు ఎంతో సుతారంగా బండిని లాగుతూ బండి బోల్తా కొట్టకుండా పొలాల్లోకి తీసుకెళ్లి ఆగేవి. ఎడ్లను విడిచి విశ్రాంతి కోసం వాటిని మేత వేయడానికి వదిలితే ఆ పొలం గట్ల వెంబడి పెరిగిన పచ్చ గడ్డి తింటూ పొలం గట్టుదాటేవి కావు. తాళ్ల చేను గట్టు, పేడ చెరువు చేను గట్టు…ఇలా పిలిచే వారు.
బాల్యంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఫలానా వారి మనవడిని ఫలానా వారి అబ్బాయిని అని చెప్పే వాళ్ళు కానీ నా పేరు ఫలానా అని చెప్పేవారు కాదు. పిల్లల మాటలు, చేతలు, వ్యక్తిత్వాల చుట్టూ పెద్దవాళ్ల పెద్దరికం గట్లు బలంగా ఉండేవి. వాళ్లు కూడా చిన్న చిన్న సమస్యలకు కోపతాపాలకు చలించే వాళ్లు కాదు. వర్షాకాలం రోడ్ల మీద నీళ్ళు నిలిచిపోయి జలమయం అయితే ఎవరికి తోచినట్లు వారు పారలు తీసుకు వచ్చి పక్క కాలువలు తవ్వి నీరు పారేలా రోడ్డు నడవగలిగేలా చేసేవారు. ఎవరైనా కాలం చేస్తే గబగబా చుట్టుపక్కల వాళ్లు కాస్త ఓపిక ఉన్న మనుషులు పోగయి, ఇక జరగాల్సింది చూడండి అంటూ పదే పదే గుర్తు చేస్తూ దానికి ఏర్పాట్లను కూడా చేస్తూ తమ మాటల సందడితో బాధను పంచుకునే వారు. నాలాంటి పిల్లలు ఎప్పుడైనా ఆకతాయిగా తామర కాయల కోసం చెరువు గట్ల వెంబడి తిరుగుతూ కనిపిస్తే గ్రామంలో పెద్ద వాళ్ళు ఏరా ఇంట్లో చెప్పావా…. ఇక్కడికొచ్చావని. మీ తాతకు చెప్తానుండు మీ నాన్నకు చెప్తాను అంటూ ఒక్కసారి బెదిరించే సరికి హడలిపోయి ఇంటికి పరుగు తీసే వాళ్ళం. దొంగతనంగా సీమ తుమ్మ కాయలు కోసుకుని తిందామని వాసం కర్రకు కొక్కెం కట్టుకుని మధ్యాహ్నం పూట అందరూ కునుకు తీసే సమయంలో వేసవికాలంలో వెళితే ఆ ఇంటి పెద్ద మమ్మల్ని చూరులోంచి చూసి మందలిస్తే సిగ్గు పడి పారిపోయే వాళ్ళం. శ్రీ రామనవమి పందిళ్ళ లో ప్రసాదాలు పంచటానికి పోటీలు పడి పడిగాపులు కాసే వాళ్ళం. సంక్రాంతి రోజుల్లో హరిదాసు ఎప్పుడొస్తాడని పెట్టిన బియ్యం తీసుకుని అరిసెలు బూరెలు ఇతర వస్తువులతో ఎదురుచూసేవారం.
శివరాత్రి నాడు ఆవుపాలు కోసం పూజారిగారు వస్తే తమ బిడ్డలకు తప్ప మాకు పాలివ్వని ఆవులకు బంధాలు వేసి రెండోవైపు దూడను కుడుపుతూ, ఆ దూడ వాళ్ళమ్మ పొదుగుని కుమ్మేస్తుంటే, మా వేళ్ళను ఆవు సళ్ళు అని భ్రాంతి పడి నురుగు నోటితో చీకేస్తుంటే, ఈ ఆరాటంలో ఆవు ఎగిరిఎగిరి తంతుంటే, పడుతూ లేస్తూ ఎలాగోలా ఒక గిన్నెలో శివలింగ అభిషేకానికి సరిపడినన్ని తీసి పూజారిగారికి ఇవ్వటం ఎంత సరదానో.
చిన్నప్పుడు అందరూ తమ ఇళ్లలో పచ్చటి పందిళ్లు వేసి పెళ్లి చేసుకునేవారు బంధుమిత్రులు సపరివారంతో కళకళలాడుతూ పెళ్లిపందిరి ఎంతో ఆనందంగా ఉండేది. మంగళ వాయిద్యాలు మోగగానే అందరూ అక్షింతలను పట్టుకుని మనస్ఫూర్తిగా పెళ్లి మంది లోకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించేవారు.
ఈ విధంగా బంధుమిత్రులను ఆహ్వానించి వారి సన్నిధిలో ఓ వధూవరులను కలపటం ఆ వివాహానికి ఒక సామాజిక ప్రామాణికత్వాన్ని నెలకొల్పి, యుక్తవయసు వచ్చిన యువతీయువకులను వివాహం పేరుతో కలిపి, సామాజిక బాధ్యతలను గుర్తు చేసి ఈ సమాజంలో వారిని ఒక భాగంగా ఏర్పరచటానికి చేసే అంకురార్పణ లాగా అనిపించేది.
పెళ్లికి వెళ్లినా, పేరంటానికి వెళ్ళినా, పెద్దకర్మకు వెళ్లినా, పలకరించడానికి వెళ్లినా, తాత చాటునో తండ్రి చాటునుండో ఆ పలకరింపులో భాగమే వంటి వారి వెంటే వెనక్కి వచ్చేవాళ్ళం. అలా నేర్చుకునే వయసులో పెద్దరికం చాటున ఒదిగి నేర్చుకుంటూ ముందుకెళ్తే ఎన్నో విషయాలు తెలిసేవి. సంభాషణ ఎలా ఆరంభించాలి, దుఃఖ సమయంలో ఎలా సంతోష సమయంలో ఎలా పలకరించాలి అన్న విషయాలు నేర్చుకోకుండా నే కరతలామలకం అయ్యేవి.
ఈ మధ్య పెద్దవారు పెద్దగా కనిపించటం లేదు. మానవ సంబంధాలు హార్దికం నుంచీ ఆర్థికానికి మారిపోవటంతో, మార్పులు వేగంగా వస్తున్నాయి. నేను ఫలానా వారి అబ్బాయినో మనవణ్ణో అని చెప్పుకోవడం లేదు.
మన బజారు, మన స్కూలు, మన మొక్కలు, మన చెట్లు, మన లైబ్రరీ, మన చెరువు, మన దారి, మన కాలువ అనే మన తత్వం పోయింది. మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, మన ఇంటి ద్వారం దగ్గర పెట్టిన మొక్కలకు నీళ్లు పోద్దామనే స్పృహ, మన లైబ్రరీ ని మనం పరిరక్షించుకుందాం అనే బాధ్యత, మన స్కూల్లో మన విద్యార్థుల సంఖ్య పెంచి స్కూలు ప్రమాణాలు పెంచుదామని ముందుచూపు తగ్గిపోయాయి… ఇలా ఎవరూ ఆలోచించడం లేదు. మనతత్వం స్థానంలో తన తత్వం నిండిపోయింది. గ్రామ వేడుకల కైనా ఉత్సవాల కైనా మరే ఇతర సామూహిక సందర్భాలలో ఇంటి పెద్ద, గ్రామ పెద్ద లాంటి పెద్దరికాలు మాయం అయిపోయాయి.
ఎవరు ఎక్కడికి పోయినా అడిగేవారు లేరు. నేను చదివిన పాఠశాలలో పిల్లలు తగ్గిపోతున్నారు. రామ నవమి ఉత్సవాలు అసలు జరగటంలేదు. పొరపాటున జరిగినా తామర దొన్నెల బదులు ప్లాస్టిక్ గిన్నెలు వచ్చేశాయి. రియల్ ఎస్టేట్ కోసం సీమ తుమ్మ కాయల చెట్లను నరికేశారు. ఇంట్లో ఎవరూ అరిసెలు వండటం లేదు. దుకాణం నుంచి తెచ్చిన అరిసెలు తీసుకెళ్లడానికి హరిదాసులు కూడా ఎవరూ రావడం లేదు. ఎవరూ ఆవులను పొలం తోలుకునివెళ్లటం లేదు. అవి కూడా గ్రామంలో జనాల లాగే అవికూడా జంక్ ఫుడ్ తింటూ తరచూ రోగాల బారిన పడుతున్నాయి. పూజారిగారు అభిషేకానికి ఆవు పాల కోసం రావటం లేదు. నూతి నీళ్లతోనే కానిచ్చేస్తున్నారు. పచ్చటి పందిళ్లు ఎవరూ వేయటం లేదు. తద్దినాలకి,(పెళ్లి) తలంబ్రాలకి అదే హాల్ బుకింగ్. ఇదివరకు ఇస్తరాకులు 4 రోజుల తర్వాత భూమిలో కలిసి పోయేవి. ఇప్పుడు తిన్న నాలుగు సంవత్సరాల తరువాత కూడా ప్లాస్టిక్ పళ్లాలు రోడ్డు మీద ఎగురుతూ తాండవం చేస్తున్నాయి. అవి భూమిలో కలవవు గాల్లో నిలువవు. వధూవరులు పెద్దల ఆశీర్వాదం కంటే ఫోటోల కోసం ఎక్కువ వంగుతున్నారు. వెళ్లిన చోట ఎవరినన్నా పలుకరిద్దాం అంటే ఎవరు ఎవరో కూడా తెలియటం లేదు. మనిషి పోతే పట్టుమని పదిమంది కూడా పోగవడం లేదు. ఎత్తండి ఎత్తండి అని వెంటపడేవారు, ఎత్తడానికి సరంజామా సిద్ధం చేసేవారు ఎక్కడనుంచి వస్తారు..?
ఊళ్ళో ఇలా గుర్తు పట్టనంతగా ప్రజలు, పరిస్థితులు, పద్ధతులు మారిపోయాయి కాస్త స్థిమితపడదాం అని పొలం వైపు వెళ్లాను. గట్లు పలుచగా అయిపోయాయి. కొన్ని చోట్ల అసలు గట్లు లేనే లేవు. పొలం గుర్తు పట్టలేకుండా ఉంది. నేనే పొలాన్ని గుర్తు పట్టలేక పోయాను. ఎన్నో వందలసార్లు గట్ల మీద నడిచివెళ్లినా.. ఎవరికి వాళ్లు సెంటో రెండు సెంట్లో ఎక్కువ కలిసి వస్తుందని గట్టులన్నీ నరుక్కుని తమ పొలంలో కలిపి వేసుకున్నారు. అసలు గట్లే లేనప్పుడు వాటిపై రాకపోకలు ఏముంటాయి..! ఒకప్పుడు ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు. వ్యవసాయదారులు గట్లని చూసి పొలాన్ని చూడమనేవారు. ఇప్పుడు గట్లని చూసి గ్రామాలను చూడమని అనాలేమో. అవును మరి. గ్రామానికి పొలం దర్పణమేగా. అక్కడ బంధాల, బాధ్యతల, పెద్దరికాల గట్లు కనుమరుగయ్యాయి. ఊరు ఒంటరిదైంది. పలకరింపులు పలచబడ్డాయి. ఇక్కడ పొలాల గట్లు కనిపించకుండా పోయాయి. పొలం కూడా ఒంటరిదై పోయింది. గట్లే లేకపోతే వాటిపై రాకపోకలు ఎలా… సామాజిక బాధ్యత కంటే వ్యక్తిగత స్వేచ్ఛ, సుఖం ప్రధానమైన ఈ రోజుల్లో గట్లు, బంధాలు, సామాజిక బాధ్యతలు, సమాజం అనే మాటలు విలువలేని చద్ది మూటలు అయిపోయాయి.ఇంకో మాట! ఇదివరకటిలాగా చద్ది ఎవరూ తినటంలా గ్రామంలో కూడా…రోడ్డు మీద పారేస్తున్నారు !!