అందరూ ఊహించిందే జరిగింది. ఊహాగానాలే నిజమయ్యాయి. రాధేశ్యామ్ సినిమాకు రాజమౌళి మార్పులు చెప్పాడు. రన్ టైమ్ తగ్గించడంతో పాటు.. స్క్రీన్ ప్లేలో కూడా చిన్న చిన్న మార్పులు చేశాడు. అలా రాజమౌళి సూచనలతోనే రేపు థియేటర్లలోకి వస్తోంది రాధేశ్యామ్ సినిమా.
రాజమౌళి చేసిన మార్పుల్లో ప్రధానమైనది క్లైమాక్స్ పార్ట్. సినిమా క్లైమాక్స్ లో షిప్ ఎపిసోడ్ కీలకం. ఆ ఎపిసోడ్ దాదాపు 15 నిమిషాల పాటు ఉందంట. కానీ రాజమౌళి వచ్చిన తర్వాత దాన్ని ట్రిమ్ చేసినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా షిప్ సెట్ లో తీసిన కొన్ని డైలాగ్ వెర్షన్లను రాజమౌళి కట్ చేసినట్టు సమాచారం.
సినిమా మొత్తం ఓ రేంజ్ లో వెళ్లిన తర్వాత, క్లైమాక్స్ వరకు తీసుకొచ్చి, కీలకమైన షిప్ లోకి సినిమాను తీసుకెళ్లిన తర్వాత మళ్లీ అక్కడ డైలాగ్స్ పెట్టడం డ్రాగ్ చేయడమే అనేది రాజమౌళి ఫీలింగ్. షిప్ లోకి ఎంటరైన తర్వాత నేరుగా డ్రామాలోకి వెళ్లిపోవాలని, డైలాగ్స్ తో కాలక్షేపం చేయకూడదని సూచించాడట జక్కన్న. అలా రాజమౌళి మార్పులతో రాధేశ్యామ్ మరింత గ్రిప్పింగ్ గా, క్రిస్పీగా తయారైందంటున్నారు యూనిట్.
ప్రభాస్ సినిమాలకు రాజమౌళి ఇలా ఆఖరి నిమిషంలో ఎంటర్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు ప్రభాస్ నుంచి వచ్చిన సాహో సినిమాకు కూడా ప్రభాస్ ఇలానే కొన్ని మార్పుచేర్పులు చెప్పాడు. ఆ తర్వాతే సాహో సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు రాధేశ్యామ్ కోసం కూడా ప్రభాస్ కోరిక మేరకు రాజమౌళి అడుగుపెట్టాల్సి వచ్చింది.