ఆర్ఆర్ఆర్ తో మరోసారి దేశవ్యాప్తంగా సంచలనమయ్యాడు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమా విదేశాల్లో సంచలనం సృష్టిస్తోంది. హాలీవుడ్ మీడియా జక్కన్న వెంట పడుతోంది. ఇందులో భాగంగా ఓ హాలీవుడ్ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి, తన భవిష్యత్ టార్గెట్ ను బయటపెట్టాడు. ఇంటర్వ్యూలో కొన్ని విశేషాలు మీకోసం..
– బాహుబలి తర్వాత చాలా ఒత్తిడికి లోనయ్యాను. అంత పెద్ద హిట్ తర్వాత ఎలాంటి సినిమా తీయాలనే ఆలోచనే ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. అంత ఒత్తిడిని తట్టుకునే సినిమా తీయాలంటే, ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలు మాత్రమే సరిపోతాయి. దానికి ఫిక్షన్ జోడించాం. ఆ ఆలోచన చాలా ఎగ్జయిటింగ్ గా అనిపించింది. మా రైటర్స్ టీమ్ కూడా బాగుందని చెప్పడంతో, వెంటనే పని మొదలుపెట్టాం. అదే ఆర్ఆర్ఆర్.
– అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే, భారీ కథను, భారీ స్థాయిలో చెప్పాల్సిందే. కాబట్టి భారీ బడ్జెట్ పెట్టాల్సిందే. సినిమా ఫెయిలైతే నష్టం ఎక్కువగానే వస్తుంది, అదే సక్సెస్ అయితే లాభాలు కూడా ఎక్కువే. అదే అర్బన్ సినిమా తీయాలనుకుంటే, అంత బడ్జెట్, అంత రిస్క్ అక్కర్లేదు. అలాంటి సినిమాల రీచ్ కూడా తక్కువే. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆర్ఆర్ఆర్ స్టోరీని ఎంపిక చేసుకున్నాను.
– భారీ సినిమా తీయాలనే నా కోరిక ఆల్రెడీ నెరవేరింది. వార్ యాక్షన్ డ్రామాను భారీ స్థాయిలో చూపించాను. నా నెక్ట్స్ టార్గెట్ ఏంటంటే.. భారతీయ కథల్ని ప్రపంచవ్యాప్తం చేయాలి. ఇండియన్ స్టోరీలు ప్రపంచంలో ముందువరసలో నిలబడాలి. ఇదే నా లక్ష్యం.