ఆర్ఆర్ఆర్ సినిమాలో భారీ ట్రయిన్ బ్లాస్ట్ సీక్వెన్స్ ఉంది. ఆ విషయం ఇప్పటికే బయటకొచ్చింది. ట్రయిలర్, మేకింగ్ వీడియోలో కూడా కొద్దిగా అది కనిపించింది. ఇప్పుడా సీన్ కు సంబంధించి రియాక్ట్ అయ్యాడు దర్శకుడు రాజమౌళి. నిజానికి అది ట్రయిన్ సెట్ కాదంటున్నాడు జక్కన్న. కేవలం ఒక మినియేచర్ మాత్రమే అని వెల్లడించాడు.
ఆర్ఆర్ఆర్ ట్రయిన్ సీన్ కోసం ఓ చిన్న బొమ్మ డిజైన్ ను మాత్రమే తయారుచేశారంట. కేవలం ఓ 15 అడుగుల ప్లేస్ లో రైలు ట్రాక్ వేశారట. దానిపై ట్రయిన్ బొమ్మను పెట్టి, బ్లాస్ట్ అయినట్టు తీశారట. దీన్నే మినియేచర్ అంటారు. అయితే ఈ సీక్వెన్స్ తీయడం కోసం నెదర్లాండ్ నుంచి టెక్నీషియన్ ను పిలిపించాల్సి వచ్చిందన్నాడు రాజమౌళి.
బాహుబలి సినిమాలో అండర్ వాటర్ సీన్స్ కోసం నెదర్లాండ్ కు చెందిన ఓ యూనిట్ పనిచేసింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో ట్రయిన్ సీక్వెన్స్ కోసం అదే నెదర్లాండ్ యూనిట్ కు చెందిన ఓ టెక్నీషియన్ ను తీసుకొచ్చారు. ట్రయిన్ ను మన ఆర్ట్ డిపార్ట్ మెంట్ నిర్మిస్తే, దానిపై రైలు బోగీల్ని మాత్రం నెదర్లాండ్ కు చెందిన టెక్నీషియన్స్ నిర్మించాడట. బ్లాస్ట్ సీక్వెన్సులు మాత్రం చెన్నైకు చెందిన నిపుణులు తీశారంట.
ఆ బ్లాస్ట్ లో నీరు, నిప్పు, ఆకులు లాంటి ఎలిమెంట్స్ అన్నింటినీ క్రియేట్ చేసి తీయడానికి దాదాపు 3 రోజులు పట్టిందని వెల్లడించాడు రాజమౌళి. అలా తీసిన సన్నివేశాలకు కొద్దిపాటి గ్రాఫిక్ వర్క్ మాత్రం చేశామని వెల్లడించాడు. చూసినవాళ్లకు అదంతా రియల్ గా అనిపిస్తుందని, కానీ అది సెట్ కాదని, కేవలం ఓ బొమ్మ ట్రయిన్ మాత్రమేనని వెల్లడించాడు రాజమౌళి.