యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజు గా చెర్రీ, కొమరం భీంగా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే రాంచరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌ను తీసుకున్నారు. అయితే సినిమాలో ఆలియా పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని ఆమధ్య వార్తలు వచ్చాయి.
`అదే విషయమై తాజాగా రాజమౌళి చెప్పిన మాటలను చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సీత పాత్రకు ఆలియాను ఎందుకు ఎంపిక చేసుకున్నారో రాజమౌళి వెల్లడించారు. `సీత పాత్ర పోషించే అమ్మాయి.. తారక్, రామ్‌చరణ్ వంటి ప్రతిభావంతులైన నటుల మధ్య నిలబడగలిగేలా ఉండాలి. అలా అని ఇది ముక్కోణపు ప్రేమకథ కాదు. సీత అమాయకంగా ఉండాలి. ప్రమాదకారిగా ఉండాలి. అలాగే చురుకుగా ఉండాలి. అందుకే ఈ పాత్ర కోసం ఆలియా భట్‌ను తీసుకున్నామ`ని రాజమౌళి అన్నారు. రాజమౌళి మాటలను బట్టి చూస్తే ఈ సినిమాలో ఆలియా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉన్నట్టే అనిపిస్తోంది.