నిజ జీవితంలో తొలి అవకాశం ఇచ్చిన వారిని ఎందరు గుర్తుంచుకుంటారు..? గుర్తుంచుకున్నా వారికి ఎందరు సహాయం అందిస్తారు..? అదీ గ్లామర్ ఫీల్డ్‌లో అలా జరుగుతుందా?
ఇలాంటి ప్రశ్నలకు కొందరే అరుదైన స్పందనతో సమాధానం ఇచ్చి అందరికీ స్పూర్తిగా నిలుస్తారు. అలంటి వారిలో సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజ్నీకాంత్ ఒకరు. నిజంగా రజ్నీ సూపర్…! ఒక సామాన్య బస్ కండక్టర్ స్థాయి నుంచి సినీ స్టార్‌గా ఎదిగినా చాలా సింపుల్‌గా ఉంటారు. చిన్ననాటి మిత్రుల్ని ఇప్పటికీ ఏంతో సాదరంగా ఆదరిస్తారు. ఎవరైనా కష్టాల్లో వుంటే ఆదుకుంటారు. డైలాగ్ కింగ్ మోహన్‌బాబును మిత్రుడిగా, ఆప్తుడిగా ఆదుకున్నారు. ఆర్ధికంగా ఏంతో కష్టకాలంలో ఉన్నప్పుడు పెదరాయుడు మూవీ నిర్మాణానికి చేయూత ఇచ్చారు. అంతే కాదు ఆ మూవీలో నటించి మోహన్‌బాబు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు సహకరించాడు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు గుర్తుచేసుకుని స్నేహానికి, మంచితనానికి రజనీకాంత్ సూపర్ అని అంటారు డైలాగ్ కింగ్…!
ఇలా ఎందరినో ఆదుకున్న రజనీకాంత్ … బైరవి సినిమా ద్వారా హీరోగా తనకు సినిమాల్లో తొలి అవకాశం ఇచ్చిన సీనియర్ నిర్మాత కలైజ్ఞానంకు ఇటీవల చెన్నైలో జరిగిన సన్మాన సభలో భారీగా స్పందించారు. కలైజ్ఞానం ఇప్పటికీ అద్దె ఇంటిలోనే ఉంటున్నారని, తమిళనాడు ప్రభుత్వం ఒక ఇల్లు కేటాయించాలని సన్మాన సభకు హాజరైన సినీ ప్రముఖుడు శివకుమార్ సభాముఖంగా అభ్యర్ధించారు. వెంటనే రజనీకాంత్ స్పందించి ఆ అవకాశం ప్రభుత్వానికి ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు.. తనకు తొలి సినీ హీరో బిక్ష పెట్టిన కలైజ్ఞానంకు సొంతంగా తానే ఇల్లు సమకూర్చుతానని ముందుకొచ్చారు. అంతే కాదు, వెంటనే చెన్నైలో కోటి రూపాయల విలువైన ఇంటిని కొనుగోలు చేశారు. తన తొలి నిర్మాతను ఆత్మీయంగా పిలిచి సన్మానించి ఈ నివాసాన్ని కానుకగా అందించారు. దటీజ్ రజ్నీ!